4,231 సర్పంచ్ స్థానాలకు 22,330 మంది, 37,179 వార్డులకు 85,428 నామినేషన్లు : ఎస్‌ఈసీ
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఐదు సర్పంచ్ స్థానాలతోపాటు, 133 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) తెలిపింది. అయితే ఇక్కడ నామినేషన్లే పడకపోవడంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఏకగ్రీవమయ్యే సర్పంచ్, వార్డు స్థానాలతోపాటు ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వస్తుందని ఎన్నికల అధికారులు చెప్పారు. మొత్తంగా చూస్తే తొలివిడత ఎన్నికల్లో...4,236 గ్రామపంచాయతీల్లో (5 మినహాయించి) 4,231 సర్పంచ్ పదవులకు 22,330 నామినేషన్లు, 37,440 వార్డు స్థానాల్లో 37,179 (133 మినహాయించి) స్థానాలకు 85,428 నామినేషన్లు దాఖలైనట్టుగా స్పష్టత వచ్చింది.
నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్
నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,950 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 గురు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోనే ఇది అత్యల్పం.
వార్డుల్లోనూ నల్లగొండే...
వార్డు సభ్యుల నామినేషన్లలోనూ నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలోని 2,870 వార్డులకు 7,893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో 4,311 మంది, సూర్యాపేటలో 4,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుల విషయంలోనూ ములుగు జిల్లా చివరిస్థానంలో ఉంది. ఇక్కడ 420 వార్డులకు కేవలం 959 మంది మాత్రమే., ఆ తర్వాతి స్థానంలో నారాయణపేట 1,183 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.
నామినేషన్ల దాఖలు కానిది ఎక్కడంటే...
మంచిర్యాల జిల్లాలోని 3 పంచాయతీలతోపాటు 34 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎస్‌ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొమురంభీమ్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంతోపాటు 30 వార్డులకు, నిర్మల్ జిల్లాలో ఒక పంచాయతీతోపాటు 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్ జిల్లాలో 19, జనగామ జిల్లాలో 10 వార్డులకు, మరికొన్ని జిల్లాల్లో కూడా కొన్ని వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్‌ఈసీ తెలిపింది.


