ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డయాబెటిస్ ఒక కుటుంబానికి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆర్థిక సమస్య కూడా. మధ్యతరగతి కుటుంబంలో ఒకరికి షుగర్ జబ్బు వస్తే వైద్య ఖర్చులకే ఆ కుటుంబ ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఒక్కరికి డయాబెటిస్ వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది.. వైద్యపరంగా సగటున ఎంత ఖర్చు వస్తుంది.. తాజా డేటాతో సమగ్ర కథనం..
భారతదేశంలో డయాబెటిస్ ఒక కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. సగటున ఒక రోగి చికిత్స, మందులు, పరీక్షలు, ఇన్సులిన్ మొదలైన వాటికి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేర్ మార్కెట్ విలువ 2024లో రూ.1.25 లక్షల కోట్లు ఉండగా, అది 2030 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
మధుమేహంతో ఆర్థిక ఇబ్బందులు ఇలా..
డయాబెటిస్ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం మందులు, పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్లు అవసరం. ఇది నెలవారీ స్థిర ఖర్చుగా మారుతుంది. ప్రత్యేక డైట్ ఫుడ్, షుగర్-ఫ్రీ ఉత్పత్తులు, గ్లూకోమీటర్లు వంటి వస్తువులు అదనపు ఖర్చు పెంచుతాయి. జబ్బు కారణంగా రోగి పని సామర్థ్యం తగ్గితే కుటుంబ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు వస్తే అదనపు వైద్య ఖర్చులు పెరుగుతాయి.
సగటు వైద్య ఖర్చులు
మధుమేహం బారిన పడిన వ్యక్తి మందులు, ఇన్సులిన్ కోసం నెలకు రూ.1,000 నుంచి రూ.4 వేలు.. అంటే సంవత్సరానికి రూ.12 వేల నుంచి రూ.48 వేలు ఖర్చవుతోంది. ఇక HbA1c, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం సంవత్సరానికి రూ.3వేల నుంచి రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డాక్టర్ కన్సల్టేషన్లకు సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, అదే జబ్బు కాస్త ముదిరితే కిడ్నీ డయాలిసిస్, హృదయ శస్త్రచికిత్స వంటి చికిత్సల కోసం రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటోంది.


