మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ | Protest Against Union Minister Pemmasani In Mandadam | Sakshi
Sakshi News home page

మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ

Dec 27 2025 3:41 PM | Updated on Dec 27 2025 4:43 PM

Protest Against Union Minister Pemmasani In Mandadam

సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది..
రాజధానిలో ఎన్‌–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్‌ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..

‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.

ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు  రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement