గర్భిణులకు డయాబెటిక్ ప్రమాదం
తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం
చాపకింద నీరులా విస్తరిస్తున్నషుగర్ వ్యాధి
రాయదుర్గం: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం విస్తరిస్తోంది. ఆడ, మగ, వయసు తేడా లేకుండా ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. భూమిపై జీవించే వారినే కాదు.. ఇంకా భూమిపై పడని గర్భస్థ శిశువులపైనా ప్రభావం చూపిస్తోంది. జెస్టేషనల్ డయాబెటిస్ తల్లికే కాదు బిడ్డకూ హాని కలిగిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భం ధరించకముందు కొందరికి, ఆ తర్వాత మరికొందరికి మధుమేహం లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ అయిన తక్షణం కంగారు పడాల్సిన పనిలేదు.
తగు చికిత్స తీసుకుంటే, జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన, పండంటి శిశువులకు జన్మనివొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ ఈ వ్యాధి లక్షణాలతో బాధపడేవారి సంఖ్యతో పాటు గర్భిణుల్లోనూ నానాటికి ఎక్కువవుతోంది. జిల్లాలో 2021–22 నుంచి 2024–25 వరకు 1,39,175 మంది గర్భిణులకు డయాబెటిక్ పరీక్షలు నిర్వహించగా, 545 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.
మారిన ఆహారపు అలవాట్లతోనే విజృంభణ
మారిన ఆహారపు అలవాట్ల కారణంగా షుగర్ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మేల్కొనపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే తల్లులు జాగ్రత్తలు పాటిస్తేనే బిడ్డల భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తారు. లేకుంటే జీవితాంతం ఈ ‘తీపి’ గుర్తు చెరగని ముద్రగా వేధిస్తుంది.
గర్భం దాల్చి 24 వారాలు నిండిన తర్వాత ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ (ఓజీటీ) చేయించుకోవాలి. ఫాస్టింగ్ షుగర్ పరీక్షల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయి 90 కన్నా ఎక్కువ, పోస్ట్ ప్య్రాండియల్ షుగర్ పరీక్షల్లో 140 కన్నా ఎక్కువగా ఉంటే జస్టేషనల్ డయాబెటిస్ అంటారు. కేవలం గర్భధారణ సమయంలో మాత్రమే కనిపించినా.. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రమాదకరంగా పరిణమిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భయపెడుతున్న డయాబెటిస్
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ప్రధానంగా గర్భధారణ సమయంలో షుగర్‌వ్యాధి బారినపడితే గర్భస్థ శిశువు పరిమాణం, బరువు పెరుగుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
అలాగే గర్భంలోనే శిశువుకు షుగర్ అలవాటు కావడం వల్ల ప్రసవం తర్వాత శిశువు శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోతాయి. పాపాయిని ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. గర్భధారణ సమయంలో షుగర్ వ్యాధి నిర్ధారణ అయితే బిడ్డకు డయాబెటిస్ వస్తుందని చాలామంది భయపడుతుంటారు. అయితే ఇది అపోహ మాత్రమేనని వైద్య నిపుణులంటున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
గర్భధారణ సమయంలో ఆహారపు అలవాట్లతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ప్రసవం తర్వాత సరైన ఆహారం తీసుకోని వారిలో, ఆహారపు నియమాలు పాటించని వారిలో నాలుగైదేళ్ల తర్వాత డయాబెటిస్ బయటపడుతుంది. ప్రసవం తర్వాత సాధారణంగా తల్లులు బరువు తగ్గుతారు.
కొంత మంది మొదటి మూడు నెలలు బరువుతగ్గి ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. ప్రసవం తర్వాత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ గురించి భయపడాల్సిన పనిలేదు.
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
గర్భిణులే కాదు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మారుతున్న ఆహారపు అల
వాట్లు, వ్యాయామంలాంటివి లేక బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు తప్పక షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే బిడ్డకు సోకకుండా రక్షించుకోవచ్చు.
జాగ్రత్తలు తీసుకోవచ్చు. గర్భం ధరించినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినట్లు కనిపించినా ప్రసవం తర్వాత చాలామందిలో మటుమాయం అవుతుంది. ముఖ్యంగా ఆహారపు నియమాలతో పాటు వ్యాయామం చేయాలి. – ఈబీ దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి


