అకాల మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలి
● సచివాలయ ఉద్యోగుల డిమాండ్
అనంతపురం క్రైం: రకరకాల సర్వేలను గడువులోపు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండటంతో సచివాలయ ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అకాల మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆత్మ శాంతి కలగాలని సోమవారం రాత్రి అనంతపురంలోని కేఎస్‌ఆర్ కళాశాల ముందు నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ పార్కులో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలు సర్వేలను ఒకే సమయంలో పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. అయితే సంబంధిత యాప్‌లు సరిగా పనిచేయకపోవడం, అప్‌గ్రేడ్ మొబైల్ ఫోన్లు లేకపోవడం, నెట్ సరిగా పనిచేయకపోవడంతో సర్వేలు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో తీవ్రమైన పని ఒత్తిడి అనేకమంది సచివాలయ ఉద్యోగుల అకాల మరణాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేల ప్రారంభానికి ముందే ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో ప్రజల నుంచి సిబ్బందికి సరైన సహకారం అందకపోవడంతో పాటు ఓటీపీలు అడిగే సమయంలో అవమానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు చిన్నూరప్ప, వీరనారప్ప, డి.సుధాకర్, వరప్రసాద్, వి.లక్ష్మీనారాయణ, ముత్యాల రాజ్, మల్లికార్జున, సిరాల చంద్ర, రామకష్ణ, ముత్యాలు పాల్గొన్నారు.


