న్యూస్‌రీల్
● ముగిసిన సర్పంచుల పదవీ కాలం
● నేటి నుంచి పంచాయతీల్లో
ప్రత్యేక అధికారుల పాలన
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అల్తాఫ్ అలీఖాన్‌పై
త్వరలో విచారణ
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల సస్పెండ్ అయిన వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏ జీఎం అల్తాఫ్‌అలీఖాన్, అలాగే సబ్ డివిజన్ పరిధిలో కొందరు ఇన్‌పుట్ డీలర్లపై ఈనెల 9, 10న స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో విచారణ చేయనున్నారు. ఇందుకు కమిషనరేట్ నుంచి విచారణాధికారి రానున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల డివిజన్ పరిధిలో సాయిగణేష్ ఆగ్రో ఏజెన్సీస్ నిర్వాహకుడు సురేష్‌కుమార్‌రెడ్డికి చెందిన ఎరువుల లైసెన్సును ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ రద్దు చేశారు. అయితే, లైసెన్సును కక్ష పూరితంగా రద్దు చేశారని సురేష్‌కుమారెడ్డి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆగ్రోస్ జిల్లా మేనేజర్ సి.ఓబుళపతి ఇరువురినీ విచారించి జేసీకి రిపోర్టు ఇచ్చారు. సదరు రిపోర్టు ఆధారంగా తాజాగా సురేష్‌కుమార్‌రెడ్డితో పాటు ఏడీఏ అల్తాఫ్‌అలీఖాన్‌ను విచారణకు హాజరు కావాలని కమిషనరేట్ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ‘రైతన్నా మీకోసం’ లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు తమ నియోజకవర్గంలో సక్రమంగా నిర్వహించలేదని శింగనమల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఏడీఏ అల్తాఫ్‌అలీఖాన్‌పై కమిషనరేట్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం. దీనిపైనా విచారణ జరపనున్నట్లు తెలిసింది.
నాన్ చెరువులో మట్టి దొంగలు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని మొలకాల్మూరు రోడ్డు చెక్‌పోస్టు వద్ద గల నాన్ చెరువులో మట్టి దొంగలు పడ్డారు. రైతుల ముసుగులో మట్టి ఎత్తుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల్లో నుంచి మట్టి తరలించాలంటే ఇరిగేషన్ అధికారులతో పాటు తహసీల్దార్ అనుమతులు తప్పనిసరి. నిబంధనలకు లోబడి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు మాత్రమే మట్టిని నామమాత్రపు రుసుంతో ఉచితంగా తరలించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవేవీ లేకుండా నాన్‌చెరువులో నుంచి మట్టి తరలిపోతోంది. ఇష్టారాజ్యపు తవ్వకాలతో చెరువు నీటి నిల్వ అంచనాలు తప్పే అవకాశం ఉంది. చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ హరికుమార్‌ను వివరణ కోరగా తాము మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
రాయదుర్గం : మండలంలోని డి.కొండాపురం గ్రామంలో ట్రాక్టర్ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన సురేష్, శైలజ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం సురేష్ ట్రాక్టర్‌తో పొలాన్ని దుక్కి చేస్తుండగా తండ్రిని చూసి రెండేళ్ల కుమారుడు బన్నీ మారాము చేయసాగాడు. తల్లి సముదాయించినా వినలేదు. దీంతో సురేష్ తన కుమారుడిని తీసుకుని ట్రాక్టర్ తోలుతూ దుక్కి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో కుదుపులకు బన్నీ పట్టుతప్పి ట్రాక్టర్ కిందపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
8 పోస్టులు.. రూ.64 లక్షలు!
అనంతపురం టౌన్: విద్యుత్ శాఖ సబ్ స్టేషన్లలో ఆపరేటర్ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారు. భారీగా వసూలు చేశారు. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే కొలువు అన్న రీతిన ఆశ చూపి రూ.లక్షల్లో దండుకున్నారు. పొరుగు సేవల కింద చేపట్టే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ప్రజాప్రతినిధి అండదండలతో అమ్మేశారన్న విషయం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 8 ఉద్యోగాలు...
విద్యుత్ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల విద్యుత్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురంలో రెండు విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో షిఫ్ట్ ఆపరేటర్లను నియామకం చేసుకునేందుకు అనుమతులిచ్చింది. అందులో భాగంగా నగరంలోని డీ 5 సెక్షన్‌లో–4 ఉద్యోగాలు, డీ–4 సెక్షన్ పరిధిలోని టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద నూతనంగా ఏర్పాటైన సబ్ స్టేషన్‌లో 4 ఉద్యోగాలను అధికారులు భర్తీ చేశారు.
రేటు కట్టి.. నిధులు కొల్లగొట్టి
విద్యుత్ శాఖ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి వసూళ్లకు తెరలేపాడు. తన అనుచరుల ద్వారా అన్ని వివరాలు సేకరించి చివరికి ఒక్కో పోస్టుకు రూ.8 లక్షలకు రేటు కట్టాడు. ఆ మేరకు ఎవరు సమర్పిస్తే వారికే సిఫార్సు లేఖ ఇద్దామంటూ అనుచర గణానికి స్పష్టం చేశాడు. 8 పోస్టులకు రూ. 64 లక్షలను తన అనుచరుడి ద్వారా వసూలు చేసి జేబులోకి వేసుకున్నాడు. ఆయా అభ్యర్థుల్లో పలువురికి ‘అర్హత’ లేకపోయినా.. డబ్బు ముట్టజెప్పిన నేపథ్యంలో వారి పేర్లను విద్యుత్ శాఖ ఎస్‌ఈకి సిఫార్సు చేశాడు. ప్రజాప్రతినిధి అండ ఉండడంతో వారందరికీ విద్యుత్ అధికారులు ఉద్యోగాలు కట్టబెట్టారు.
వెలుగులోకి ఇలా..
షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఐటీఐ (ఎలక్ట్రికల్) అర్హత తప్పనిసరి. అయితే అలాంటివి ఏమీ లేకుండానే పోస్టింగ్‌లు ఇచ్చారని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి విచారణలో తేలడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన సీఎండీ అలాంటి వారిపై వేటు వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏజెన్సీలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఈలను ఆదేశించారు. దీంతో ఉద్యోగం పోయిన అనంత పురానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు తాము ఇచ్చిన డబ్బు వెనక్కు ఇవ్వాలని, లేని పక్షంలో ప్రజాప్రతినిధి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామంటూ తెగేసి చెప్పిట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ను వివరణ కోరగా ఆయన స్పందించారు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నారన్న విషయం తమకు తెలియదన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారన్నారు. ఏజెన్సీలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.
అనంతపురం ఎడ్యుకేషన్/తాడిపత్రి రూరల్/రాయదుర్గం: గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఐదేళ్ల పదవీ కాలం గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి వారు ‘మాజీలు’గా మారనున్నారు. ఇకపై ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. జిల్లాలో మొత్తం 575 పంచాయతీలున్నాయి. వీటిలో అనంతపురం రూరల్ మండలం ఏ.నారాయణపురం, పామిడి పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. ఇకపై కూడా వారే కొనసాగనున్నారు. తక్కిన 575 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేక అధికారుల జాబితాకు కలెక్టర్ ఆనంద్ ఆమోదముద్ర వేశారు. ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంఈఓలతో పాటు ఇతర మండలస్థాయి గెజిటెడ్ అధికారులను నియమించారు. జనాభా, విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో మండలంలో ఒక్కో అధికారికి 2–6 పంచాయతీలను అప్పగించారు.
చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ సీపీ బలపరచిన వారే సర్పంచ్‌లుగా ఉండ డంతో వీరిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. పంచాయతీ ఖాతాల్లోని నిధులను డ్రా చేయకుండా ఆంక్షలు విధించింది. పంచాయతీల్లో పారిశుధ్యం, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ కోసం సొంత డబ్బును ఖర్చు చేసిన సర్పంచ్‌లు నిధులను డ్రా చేసుకోలేని పరిస్థితి కల్పించింది. అత్యవసర పనుల కోసం నిధులు చెల్లించాలంటే డీడీఓల అనుమతి తప్పనిసరి చేసింది. చేసిన అభివృద్ధి పనులకు సైతం బిల్లులను నిలుపుదల చేసింది. పైగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్పంచులపై టీడీపీ నాయకులు ఆధిపత్యం ప్రదర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించకుండా అడ్డుపడ్డారు. సర్పంచుల పాలన ముగిసిన నేపథ్యంలో ఆర్థిక సంఘం నిధులు కొల్లగొట్టేందుకు కొందరు పావులు కదుపుతున్నారు.
ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే..?
చంద్రబాబు సర్కారు ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా కనిపించడం లేదు. హామీలు అమలు చేయకపోవడం, అభివృద్ధిని అటకెక్కించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే భంగపాటు తప్పదని భావించి మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి.
పంచాయతీలకు శాపం..
సకాలంలో పంచాయతీ ఎన్నికలు జరగకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోనున్నాయి. ఆర్థిక సంఘం నిధులతోనే పంచాయతీల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీరు తదితర పనులు జరుగుతాయి. నిధులు అందని పక్షంలో పంచాయతీలకు శాపంగా మారనుంది. అభివృద్ధి అటకెక్కనుంది.
పదో తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. దీంతో విద్యార్థులు పెట్టేబేడా సర్దుకుని ఇంటి ముఖం పట్టారు. ఆనందంగా సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. బస్సులో సీట్ల కోసం పలువురు పడరాని పాట్లు పడ్డారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
‘పచ్చ’ నేత.. పోస్టుల మాటున మేత
విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల అమ్మకం
దగ్గరుండి తన అనుచరుడితో డబ్బు వసూలు చేయించిన అనంతపురం ప్రజాప్రతినిధి


