నేటితో ముగియనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మంగళవారంతో ప్రాక్టికల్ పరీక్షలు ముగియనున్నాయి. ఒకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి ప్రారంభం కాగా, జనరల్ విద్యార్థులకు ఈ నెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన పరీక్షలకు 65 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో జనరల్ విద్యార్థులు 1,179 మందికి గాను 1,160 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,066 మంది విద్యార్థులకు గాను 1,051 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 433 మందికి గాను 402 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణనాయక్ మూడు కేంద్రాలు, జిల్లా వృతి విద్యా శాఖాధికారి గురువయ్యశెట్టి మూడు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఎనిమిది, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఏడాది వృథా కాకుండా...
జిల్లా వ్యాప్తంగా 13 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో వారికి కేటాయించిన విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు. వాస్తవానికి వారు మళ్లీ వచ్చే ఏడాదే రాసుకోవాల్సి ఉంది. అయితే వైద్య చికిత్స చేయించుకుని మెడికల్ సర్టిఫికెట్లు జతచేసి ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత విడతల్లో అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు చర్చించారు. ఎట్టకేలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత విడతల్లో రాసుకునే అవకాశం కల్పించారు. అనంతపురం, కంబదూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన 13 మంది విద్యార్థులకూ మళ్లీ అవకాశం కల్పించి రాయించారు.


