● విధుల్లో లేని విద్యుత్ శాఖ ఉద్యోగుల సస్పెన్షన్
● జేఎల్‌ఎం మృతి ఘటనలో అధికారుల తీరుపై విమర్శలు
అనంతపురం టౌన్: ఇటీవల విద్యుత్ షాక్‌తో ఓ జేఎల్‌ఎం మృతి చెందితే ఆ రోజు విధుల్లో లేని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు. తప్పు ఒకరు చేస్తే.. శిక్ష మరొకరికి వేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 29న అనంతపురంలోని మొదటి రోడ్డు శివాలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మరమ్మతులు చేస్తూ జేఎల్‌ఎం వెంగముని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ చేపట్టిన అధికారులు లైన్‌మెన్ రామాంజులరెడ్డి, జేఎల్‌ఎం విశ్వనాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
మార్చి 29న పీక్‌లోడ్ డ్యూటీలో ఫోర్‌మెన్ గోపాల్‌తో పాటు లైన్‌మెన్ శ్రీరాములు, జేఎల్‌ఎంలు వెంగముని, విశ్వనాథ్ విధుల్లో ఉన్నారు. రాత్రి 8.40 గంటల సమయంలో సవేరా ఆస్పత్రి సమీపంలో తలెత్తిన లో–ఓల్టేజీ సమస్య పరిష్కారానికి లైన్‌మెన్ శ్రీరాములు, జేఎల్‌ఎం విశ్వనాథ్ అక్కడికెళ్లారు. రాత్రి 8.50 గంటల సమయంలో శివాలయం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక సమస్య తలెత్తి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు జేఎల్‌ఎం వెంగమునితో పాటు పోల్ టూ పోల్ వర్కర్ వన్నూర్ వెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై వెంగముని మృతి చెందాడు. వాస్తవానికి ఈ పనిని పీక్‌లోడ్‌లో భాగంగా ఫోర్‌మెన్ గోపాల్ చేయాల్సి ఉంది. అయితే అతను ఇప్పటి వరకూ ఏనాడు రాత్రి సమయంలో విధులు నిర్వర్తించింది లేదు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి ఓ ఉద్యోగి ప్రాణం పోయేందుకు కారణమైన ఫోర్‌మెన్‌ను వదిలి ఆ రోజు విధుల్లో లేని లైన్‌మెన్ రామాంజులరెడ్డితో పాటు జేఎల్‌ఎం విశ్వనాథ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. దీని వెనుక ఉన్న మరమ్మమేమిటో ఉన్నతాధికారులకే తెలియాలి.
డీ–3 ఏఈ నివేదిక ఇలా ఉంది:
జేఎల్‌ఎం వెంగముని మృతిపై విద్యుత్ శాఖ డీఈఈ జేవీ రమేష్‌కు డీ–3 సబ్‌స్టేషన్ ఏఈ రవీంద్రప్రసాద్ నివేదిక అందజేశారు. అందులో ‘వెంగముని చనిపోయిన రోజు ఫోర్‌మెన్ గోపాల్ విధుల్లో లేరు. ఆ రోజు సెలవు తీసుకున్నారు’ అంటూ పేర్కొన్నారు. అయితే ఆ రోజు పీక్‌లోడ్ డ్యూటీలో ఫోర్‌మెన్ గోపాల్ లేకపోతే ఆ విధులు ఎవరు నిర్వర్తించారు? ఆ అధికారి పేరు ఏమిటి? ఇలాంటి వివరాలు ఏమీ పొందుపరచకుండానే ఏకపక్షంగా గోపాల్‌ను కాపాడేందుకే డీ–3 ఏఈ ప్రయత్నించినట్లు ఆ నివేదిక స్పష్టం చేస్తోందని విద్యుత్ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. దీని వెనుక ఉన్నతాధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోర్‌మెన్ లేకపోతే లైన్ ఇన్‌స్పెక్టర్ హోదా ఉన్న వ్యక్తికి డ్యూటీ వేయాల్సి ఉన్నా అలాంటి చర్యలు ఏమి చేయకపోగా, డ్యూటీలో లేని వ్యక్తులను టార్గెట్ చేస్తూ నివేదిక ఇచ్చి సస్పెండ్ చేసిన విధానాన్ని తప్పు బడుతున్నారు. ఇప్పటికై నా ఈ అంశంపై ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు అభద్రత భావంతో నలిగి పోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివేదిక మేరకే చర్యలు
ఈ విషయంపై ఈఈ జేవీ రమేషన్‌ను వివరణ కోరగా.. ‘ఫోర్‌మెన్ గోపాల్ డ్యూటీలో లేడంటూ ఏఈ నివేదిక ఇచ్చాడు. ఆ మేరకు లైన్‌మెన్ రామాంజులరెడ్డి, జేఎల్‌ఎం విశ్వనాథ్‌పై చర్యలు తీసుకున్నాం. జేఎల్‌ఎం వెంగముని చనిపోయిన రోజు పీక్‌లోడ్ డ్యూటీలో ఉన్న ఉద్యోగుల వివరాలను తీసుకున్న అనంతరం విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.


