కణేకల్లు: కుక్కలు పగబడతాయా? అనే ప్రశ్నకు అవుననే కణేకల్లు వాసులు సమాధానమిస్తున్నారు. శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఘటనను ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వివరాల్లోకి వెళితే... కణేకల్లులోని దిగువ వీధి మస్జీద్ ప్రాంతంలో నివాసముంటున్న దాదావలికి భార్య దిల్షాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్థానిక నేసేపేటలో స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా దాదావలి పనిచేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో నమాజ్ చేసేందుకు మస్జీద్‌కు బయలుదేరిన ఆయన... తన ఇంటి ఎదుట పిల్లి వెంటబడిన కుక్కను గమనించి అదిలించాడు. పిల్లిని కాపాడిన అనంతరం ఇంట్లోకి వెళ్లి కాసేపటి తర్వాత బయటకు వచ్చాడు. ఆ సమయంలో అప్పటికే అక్కడ కాపు కాసిన కుక్క ఒక్కసారిగా మీదకు దూకింది. దాదావలి చేతిని గట్టిగా కరిచి పట్టుకుంది. దాని బారి నుంచి తప్పించుకుని ఆయన ఇంట్లోకి పరుగున వెళ్లాడు. ఆ వెనుకనే ఇంట్లోకి చొరబడిన కుక్క... దాదావలి భార్య దిల్షాద్, కుమార్తె అలియాను కరిచింది. ముగ్గురి చేతులు, కాళ్లపై బలమైన కుక్కగాట్లు పడ్డాయి. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. బెడ్‌రూమ్ వైపుగా పోతున్న కుక్కను గమనించి వెంటనే ఆ తలుపులను మూసేసి, కుక్కను అక్కడి నుంచి తరిమేశారు. బెడ్‌రూమ్‌లోకి కుక్క చొరబడి ఉంటే అక్కడ నిద్రిస్తున్న ఇద్దరు కుమార్తెలను కూడా కరిచి ఉండేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలంటూ కోరుతున్నారు.


