శింగనమల(నార్పల): దుకాణదారుడిపై మత్తు మందు చల్లి రూ.45 వేలు అపహరించుకెళ్లిన ఘటన నార్పలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలకు చెందిన మల్లికార్జున స్థానికంగానే గూగూడుకు వెళ్లే మార్గంలో డ్రిప్ పరికరాల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఆయన ఒక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి రూ.500కు చిల్లర కావాలని అడుగుతూ మల్లికార్జున ఏమరపాటుగా ఉన్న సమయంలో వెంటనే మత్తు మందు చల్లాడు. దీంతో మల్లికార్జున వెంటనే మత్తులోకి జారుకోవడంతో కౌంటర్‌లోని రూ.45 వేలను ఆగంతకుడు అపహరించుకెళ్లాడు. కాసేపటి తర్వాత మత్తు నుంచి బయటపడిన మల్లికార్జున కౌంటర్‌లో నగదు కనిపించకపోవడంతో విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సాగర్ క్షేత్ర స్థాయికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సీఎం పర్యటన
ఏర్పాట్ల పరిశీలన
యాడికి: ఈ నెల 6న యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు ఉన్నారు. మార్కెట్ యార్డ్‌తో పాటు రాయలచెరువులోని చెరువు, రాయలచెరువు నుంచి గుత్తికి వెళ్లే మార్గం, పచ్చారుమేకలపల్లి సమీపంలోని యాడికి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై స్థానిక నేతలు, అధికారులకు పలు సూచనలు చేశారు.


