రాయదుర్గం టౌన్: స్థానిక మొలకాల్మూరు మార్గంలోని సున్నపుబట్టీల సమీపంలో ఉన్న కాలనీ వాసులు తాగునీటి సమస్యపై శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై అధికారుల వైఖరిని ఎండగట్టారు. వారం రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఐదారు రోజులు గడుస్తున్నా నీరు సరఫరా చేయకపోతే అవసరాలు ఎలా తీరుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బోరు వేసి సిస్టన్ ట్యాంకు ఏర్పాటు చేశారని, దానిని వినియోగంలోకి తీసుకురాకుండా తాళం వేస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ డీఈ సురేష్, ఏఈ నరసింహులు అక్కడకు చేరుకుని మహిళలతో మాట్లాడారు. సిస్టన్ ట్యాంకుకు తాళం వేయకుండా చూసుకుంటామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా నీటి సరఫరా చేయలేకపోతున్నామని, సమస్యను అధిగమించి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని తలారిచెరువు సమీపంలో ఉన్న దయ్యాలకుంట బావిలో 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వీఆర్వో శ్రీనివాసులు ఇచ్చిన సమాచారంతో శుక్రవారం రాత్రి తాడిపత్రి అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధరరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


