బెళుగుప్ప: ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి ఓ యువతి మృతిచెందింది. స్థానికులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం తెనెగళ్లు గ్రామానికి జయశ్రీ (29) శుక్రవారం ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరింది. ఎండ వేడిమికి తాళలేక తలకు చున్నీ చుట్టుకుంది. బెళుగుప్ప మండలం కాలువపల్లి తండా వద్దకు చేరుకోగానే చున్నీ కాస్త వాహన చక్రానికి చుట్టుకోవడంతో అదుపు తప్పి కిందపడింది. అపస్మారకంగా పడి ఉన్న జయశ్రీతో పాటు గాయపడిన చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
ప్రైవేట్ వెంచర్‌లో సీసీ రోడ్డు పనుల నిలుపుదల
కూడేరు:
మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న స్కంద (ప్రైవేటు) వెంచర్లో రూ.50 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో అధికార పార్టీ నేతలు చేపట్టిన సీసీ రోడ్డు పనులను అధికారులు ఆపేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ వెంచర్‌లో 40 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. గొటుకూరు పంచాయతీలోని బ్రాహ్మణపల్లి, రామచంద్రాపురం తదితర గ్రామాల్లో వీధుల్లో చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లు బాగు చేయకుండా ప్రభుత్వ నిధులతో ఓ ప్రైవేట్ వెంచర్‌లో టీడీపీ నాయకులు వేస్తున్న సీసీ రోడ్డును గమనించిన గ్రామీణులు మండిపడ్డారు. దీనికి అధికారులు కూడా వత్తాసు పలకడాన్ని ఆక్షేపించారు. ఇదే అంశంపై గత నెల 24న ‘ప్రభుత్వ ధనం.. ప్రైవేట్ పరం’ శీర్షికతో ‘సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు తక్షణమే సీసీ రోడ్డు నిర్మాణ పనులు నిలుపుదల చేయడంతో పాటు లోతైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఆర్ ఏఈ రమణయ్య శుక్రవారం ప్రైవేట్ వెంచర్‌లో సాగుతున్న పనులను నిలుపుదల చేయించారు.
బడ్జెట్ వ్యయంపై ప్రణాళిక ఉండాలి
● అధికారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచన
అనంతపురం అర్బన్: బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చు చేయడంపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. బడ్జెట్ 2026–27కు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్‌తో కలిసి అధికారులతో మంత్రి అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా పంపాలి, శాఖల్లో ఏం జరుగుతోంది అనే విషయంపై అందరికీ అవగాహ కల్పించడం అవుట్ రీచ్ కార్యక్రమం ఉద్ధేశమన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయి ఎక్కడ... ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై స్పష్టత ఉండాలన్నారు. ప్రభుత్వ నిధులు సొంత డబ్బులాంటిదన్నారు. ఇంటి అవసరాలకు ఎలా ఖర్చు చేస్తామో అంతే బాధ్యతగా, సమర్థవంతంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలన్నారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ తగిన ప్రయోజనం కళ్ల ముందు కనిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ ఎ.మలోల, సీపీఓ అశోక్‌కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


