హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారు! | - | Sakshi
Sakshi News home page

హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారు!

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

తాడిపత్రి రూరల్‌: మండలంలోని తలారిచెరువు వద్ద ఉన్న గాలిమరల సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా, కొడుకు మృతిపై తండ్రి అనుమానాలు వ్యక్తం చేయగా... పోలీసుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బంధువులు వాపోతున్నారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.... తాడిపత్రిలోని టైలర్స్‌ కాలనీకి చెందిన దాదాబాషా (26) ఆర్జాస్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. గత నెల 31న సాయంత్రం ఇంటికి వచ్చిన దాదాబాషా వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తాళలేకపోతున్నానంటూ కుటుంబ సభ్యులతో అవేదన వ్యక్తం చేశాడు. అనంతరం స్కూటర్‌పై బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. సెల్‌ఫోన్‌ పనిచేయలేదు. దీంతో భయపడిన తల్లిదండ్రులు డయల్‌ 100కు కాల్‌ చేశారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

డయల్‌ 100 సమాచారంతో తాడిపత్రి పట్టణ పీఎస్‌ నుంచి ఓ కానిస్టేబుల్‌ వెంటనే దాదాబాషా తండ్రి ఇమ్రాన్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగాడు. దాదాబాషా ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. అనంతరం ఈ నెల 1న ఉదయం పీఎస్‌కు ఇమ్రాన్‌ వెళ్లి ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ను కలసి ఫిర్యాదు చేశారు. షేర్‌ మార్కెట్‌లో దాదాబాషా డబ్బు పోగొట్టుకున్నట్లుగా అతని స్నేహితుడు తమతో చెప్పాడంటూ అతని వివరాలు ఎస్‌ఐకి అందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు వారిని ఇంటికి పంపించేశారు. కొడుకు కనిపించడం లేదన్న ఆత్రుతతో అదే రోజు మధ్యాహ్నం మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు వెళితే అక్కడున్న కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తల్లిదండ్రులు బాధతో ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం మరోసారి ఎస్‌ఐని కలిస్తే హనుమన్‌ విజయోత్సవ ర్యాలీలో బిజీగా ఉన్నామని, తరువాత రావాలని సూచించి

పంపించేశారు.

దర్గా నిర్వాహకులు

గమనించి...

దాదాబాషా కోసం బంధువులతో పాటు ముస్లిం సమాజంలోని మరికొందరు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తలారిచెరువు వద్ద ఉన్న దర్గాకు చెందిన పెద్దలు గురువారం రాత్రి ఇమ్రాన్‌కు ఫోన్‌ చేశారు. గాలిమరల సమీపంలో ఉన్న చెట్టుకు ఓ యువకుడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉందని, దాదాబాషా ఫొటో పంపితే తాము పరిశీలించి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. దీంతో వెంటనే వారి మొబైల్‌ వాట్సాప్‌ నంబర్‌కు దాదాబాషా ఫొటోలను ఇమ్రాన్‌ పంపాడు. వాటిని పరిశీలించిన దర్గా పెద్దలు చెట్టుకు ఉరి వేసుకున్నది దాదాబాషానే అని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్‌గ్రేడ్‌ పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతిపై అనుమానాలు

తన కుమారుడిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ విలేకరుల ఎదుట దాదాబాషా తండ్రి ఇమ్రాన్‌ వాపోయాడు. సంఘటనా స్థలంలో దాదాబాషా స్కూటీ, సెల్‌ఫోన్‌ కనిపించక పోవడం తమ అనుమానాలకు బలమిస్తోందన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పట్టణ పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసుల నిర్లక్ష్యమే దాదాబాషా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందంటూ బంధువులు ఆరోపించారు. ఇప్పటికై నా వాస్తవాలు నిర్ధారించి, దాదాబాషా మృతికి కారణాలు వెల్లడించాలని కోరారు. కాగా, ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అప్‌గ్రేడ్‌ సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.

యువకుడి మృతిపై తండ్రి అనుమానం

పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement