భారతదేశంలో ఆరోగ్య బీమా రంగం మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన మార్పులకు లోనవుతోంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవనశైలి వ్యాధుల ముప్పు, డిజిటలైజేషన్ వెరసి భారతీయులు తమ ఆరోగ్య రక్షణపై చూపే దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ మార్పులను విశ్లేషిస్తూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ‘ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, ప్రజలు కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ముందస్తు జాగ్రత్తలు, సమగ్ర రక్షణ కోసం బీమాను ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే (2023-24 నుంచి 2024-25 వరకు) బీమా చేయించుకున్న సభ్యుల సంఖ్య 27 శాతానికిపైగా పెరగడం విశేషం. వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్య బీమాను తమ ప్రాథమిక అవసరంగా గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం.
యువత, సీనియర్ సిటిజన్ల ఆసక్తి
కొత్త పాలసీదారుల్లో యువత (18-35 ఏళ్లు వయసు) వాటా 30 శాతం పైగా ఉంది. సీనియర్ సిటిజన్ల (60+ ఏళ్లు) నిష్పత్తి 14 శాతానికి చేరుకుంది. పిల్లల (0-17 ఏళ్లు) కోసం సగటు బీమా మొత్తాన్ని (Sum Insured) తల్లిదండ్రులు 7 శాతం మేర పెంచుకుంటున్నారు. ఇది భవిష్యత్ ఆరోగ్యం పట్ల వారి నిబద్ధతను చూపుతోంది.
క్లెయిమ్‌లకు కారణమవుతున్న వ్యాధులు
ఆసుపత్రిలో చేరడానికి ఇన్ఫెక్షన్లతో పాటు జీవనశైలి వ్యాధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్‌లున్నాయి. వీటిలో గుండె, క్యాన్సర్ చికిత్సల కోసం క్లెయిమ్ చేసే మొత్తం విలువ నిరంతరం పెరుగుతోంది.
యాప్‌ల ద్వారానే అంతా..
సాంకేతికత వాడకంలో భారతీయులు ముందంజలో ఉన్నారు. ఆరోగ్య బీమా సేవలకు స్మార్ట్‌ఫోన్లు కీలకంగా మారాయి. ఆన్‌లైన్ రెన్యూవల్స్ గతంతో పోలిస్తే 10% పెరిగాయి. కేర్ హెల్త్ యాప్ ద్వారా 30% క్లెయిమ్‌లు, 15% రెన్యూవల్స్ జరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో ఆన్‌లైన్ ద్వారా పాలసీ కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయి. ప్రీమియం డిస్కౌంట్ల కోసం ‘స్టెప్ ట్రాకింగ్’ వాడే వారి సంఖ్య 2.5 రెట్లు పెరగడం గమనార్హం.
సమగ్ర కవరేజీకే మొగ్గు
పాలసీదారులు కేవలం హాస్పిటలైజేషన్ మాత్రమే కాకుండా మరిన్ని సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని చిన్నపాటి చికిత్సలకు ఓపీడీ బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారు. టెలికన్సల్టేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో డాక్టర్ సలహాలు, బీమా పరిమితిని పెంచుకోవడం, నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా పైసా ఖర్చు లేకుండా చికిత్స పొందడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మనీష్ దొడేజా మాట్లాడుతూ.. ‘భారతీయ ఆరోగ్య బీమా పాలసీదారులు ఇప్పుడు ముందస్తు రక్షణ పట్ల చురుకుగా వ్యవహరిస్తున్నారు. వారు కేవలం పాలసీని కొనుగోలు చేయడమే కాకుండా, సాంకేతికతను వాడుకుంటూ సమగ్ర కవరేజీని కోరుకుంటున్నారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సవాళ్లు


