భారత్‌లో బీమా వృద్ధికి భరోసా | Key Findings from Swiss Re indian Insurance Report | Sakshi
Sakshi News home page

భారత్‌లో బీమా వృద్ధికి భరోసా

Jan 20 2026 8:43 AM | Updated on Jan 20 2026 8:43 AM

Key Findings from Swiss Re indian Insurance Report

2030 వరకు ఏటా 6.9 శాతం  

స్విస్‌ ఆర్‌ఈ వెల్లడి

భారత్‌ మార్కెట్లో బీమా ప్రీమియం వృద్ధి 2026–2030 మధ్యకాలలో 6.9 శాతానికి (ఏటా) పెరుగుతుందని అంతర్జాతీయ రీఇన్సూరెన్స్‌ సంస్థ స్విస్‌ ఆర్‌ఈ తెలిపింది. చైనా (4 శాతం), యూఎస్‌ (2 శాతం), పశ్చిమ యూరప్‌ దేశాల వృద్ధిని భారత బీమా మార్కెట్‌ అధిగమిస్తుందని.. బలమైన ఆర్థిక మూలాలు, డిమాండ్‌ పెరుగుతుండడం, నియంత్రణల్లో మార్పులను సానుకూలంగా ప్రస్తావించింది. 2025లో 3.1 శాతం వృద్ధికి ఇది రెట్టింపు అవుతుందని పేర్కొంది.

భారత బీమా రంగం బలమైన మధ్యస్థ వృద్ధి పథంలోకి అడుగు పెట్టిందని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. జీఎస్‌టీ సంస్కరణలు, వ్యక్తిగత ఆదాయపన్నులో మినహాయింపులు మధ్యాదాయ కుటుంబాల్లో బీమాకు డిమాండ్‌ను పెంచుతాయని విశ్లేషించింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులు మరింత పారదర్శకతను తీసుకొస్తాయని.. పరిశ్రమ మరింత వృద్ధిని సాధించే దిశగా అనుకూలిస్తాయని వివరించింది. బీమా రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని  ప్రస్తావించింది. దీంతో కొత్త మూలధన నిధులకు మార్గం సుగమం అవుతుందని, బీమా విస్తరణ పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గతేడాది సెపె్టంబర్‌ 22 నుంచి జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీని తొలగించడం తెలిసిందే.

జీవిత బీమా జోరు..

జీవిత బీమా పరంగా భారత్‌ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నట్టు స్విస్‌ ఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో ఏటా 6.8 శాతం వృద్ధి సాధ్యమేనని పేర్కొంది. రిటైర్మెంట్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండడం, పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణ ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. నియంత్రణపరమైన మార్పులు, వైద్య ద్రవ్యోల్బణం కారణంగా నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ సమీప కాలంలో సవాళ్లను ఎదుర్కోనున్నట్టు అంచనా వేసింది. మధ్య కాలానికి మాత్రం మెరుగైన వృద్ధిరేటును చూస్తుందని తెలిపింది. 2026–2030 మధ్యకాలంలో ఏటా 7.2 శాతం చొప్పున ప్రీమియం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఈ కాలంలో మోటారు బీమాలో 7.5 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement