బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. అయితే దీనికి తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు వారి ఇళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆ దేశంలో దాదాపు 258 మైనార్టీలపై దాడుల ఘటనలు జరుగగా 27మంది దాకా ప్రాణాలు వదిలారు. వారిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అక్కడి మతతత్వవాదులు దీపు చంద్రదాస్ అనే ఓ యువకుడిని తీవ్రంగా కొట్టిచంపారు. ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరవకముందే తాజాగా అక్కడి చట్టోగ్రామ్ ప్రాంతంలో ని ఓ హిందూ కుటుంబంపై అక్కడి అల్లరిమూకలు దాడిచేశాయి.
చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఒక అల్లరి మూక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారి ఇళ్లుని ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు.
అనంతరం వారిని హెచ్చరిస్తూ అక్కడ ఒక నోట్ ఉంచారు అందులో " ఈప్రదేశంలో ఉండే హిందువులను మేము గమనిస్తున్నాము. మీరు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయు. వెంటనే ఆ కార్యకలాపాలు ఆపండి. లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది అని బెంగాలీ భాషలో రాశారు.
ఒకవేళ మా హెచ్చరికను మీరు పాటించకపోతే హిందూ సమాజానికి చెందిన వారి ఆస్తులను, వ్యాపారాలను, నివాసాలను వేటిని వదిలిపెట్టబోమన్నారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరంటూ వారిని హెచ్చరిస్తూ రాశారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


