భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పడిపోయి రూ.90 మార్క్‌ను దాటి 90.02 వద్ద ముగిసింది. బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేయడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం వంటివి రూపాయి పతనానికి కారణాలుగా నిలుస్తున్నప్పటికీ రూపాయి విలువ తగ్గడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఈ కథనంలో చూద్దాం..
దిగుమతులు ఖరీదవుతాయి
క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం
దిగుమతులు ఖరీదవడం వల్ల, ఆ ఖర్చులు వినియోగదారులపై పడతాయి. దీని కారణంగా సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి.
ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి
విదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, జీవన వ్యయం ఇంకా ఖరీదవుతుంది.
ఇంధనం ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి
భారత్ మొత్తం క్రూడ్ ఆయిల్‌లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ ధర పెరగడంతో రవాణా, తయారీ, వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి.
విదేశీ రుణాల వ్యయం పెరుగుతుంది
సంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలు రూపాయి బలహీనత వల్ల ఖరీదవుతాయి. వడ్డీ చెల్లింపులు పెరిగి, ఆర్థిక భారంగా మారుతాయి.
విదేశీ పెట్టుబడులపై ప్రభావం
రూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు గురవుతాయి.
పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావం
ఒక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే, గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గవచ్చు.
ఎగుమతిదారులకు కొంత లాభం
రూపాయి బలహీనపడితే, భారతదేశం నుండి వస్తువులు కొనుగోలు చేసే విదేశీ క్లయింట్లకు అవి తక్కువ ఖర్చుతో అందుతాయి.టెక్స్‌టైల్, ఐటీ సేవలు, ఔషధాలు వంటి రంగాలకు కొంత ప్రయోజనం.


