
వృద్ధి అంచనాలు 6.8 శాతానికి పెంపు
గత చర్యలు పూర్తి ఫలితమివ్వాలి
వృద్ధిపై వాణిజ్య అనిశ్చితుల ప్రభావం
అవసరమైతే భవిష్యత్తులో రేట్ల కోత
ఆర్‌బీఐ గవర్నర్ సంకేతం...
ముంబై: ఒకవైపు అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లతో ఎగుమతులకు ఏర్పడిన అవరోధాలు, హెచ్1బీ వీసా నిబంధనల కట్టడి.. మరోవైపు గతంలో చేపట్టిన రేట్ల తగ్గింపు ఫలితం పూర్తి స్థాయిలో కనిపించాల్సి ఉండడం, ఇటీవలి జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, రూపాయి విలువ పతనం నేపథ్యంలో ఆర్‌బీఐ వరుసగా రెండో విడత కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను గతంలో వేసిన 6.5% నుంచి 6.8 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం రేట్ల తగ్గింపు పరంగా వెసులుబాటు కలి్పంచినప్పటికీ.. దీనికంటే ముందు గతంలో తీసుకున్న చర్యల తాలూకూ ఫలితంపై పూర్తి స్థాయి స్పష్టత అవసరమని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ భేటీ తర్వాత మీడియాకు తెలిపారు.
అమెరికా టారిఫ్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైతే రానున్న నెలల్లో రేట్ల తగ్గింపుతో మద్దతుగా నిలుస్తామని సంకేతం ఇచ్చారు. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు సైతం రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు, వృద్ధికి విఘాతం ఉండకూడదన్నారు. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.
వృద్ధి బలంగా..: ఎగుమతుల డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ.. వర్షాలు సమృద్ధిగా కురవడం, తక్కువ ద్రవ్యోల్బణం, గతంలో రెపో రేటు తగ్గింపు, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కారణంగా ఏర్పడే సానుకూల ప్రయోజనంతో దేశ వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ఆగస్ట్ సమీక్షలో ఈ అంచనా 6.5 శాతంగా ఉంది. వాణిజ్యపరమైన అనిశ్చితుల నేపథ్యంలో క్యూ3 (అక్టోబర్–డిసెంబర్), ఆ తర్వాతి కాలానికి వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. 2025–26 క్యూ1లో (జూన్ త్రైమాసికం) జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) 7%, క్యూ3లో 6.4%, క్యూ4లో 6.2 శాతం చొప్పున ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. అమెరికా విధించిన టారిఫ్‌లతో ఎగుమతులు మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది.
ఎగుమతిదారులకు అండ..
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో ఎగుమతిదారులకు అండగా ఆర్‌బీఐ పలు చర్యలు ప్రకటించింది. ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్’ (ఐఎఫ్‌ఎస్‌సీ)లోని ఫారిన్ కరెన్సీ అకౌంట్ల నుంచి నిధులను స్వదేశానికి బదిలీ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న నెల గడువును మూడు నెలలకు పొడిగించింది. వస్తు వాణిజ్య లావాదేవీలకు సంబంధించి చెల్లింపుల గడువును నాలుగు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇక చిన్న తరహా ఎగుమతి/దిగుమతిదారులకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే చర్యలను సైతం ప్రకటించింది.
రూపాయి అంతర్జాతీయం
అంతర్జాతీయంగా రూపాయి ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలను సైతం ఆర్‌బీఐ ప్రకటించింది. భూటాన్, నేపాల్, శ్రీలంక దేశ వాసులకు ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి మారకంలో రుణాల మంజూరుకు బ్యాంక్‌లను అనుమతించింది.
ముఖ్యాంశాలు..
→ రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించేందుకు ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రివర్స్ రెపో రేటు సైతం 3.35 శాతంగా కొనసాగుతుంది. → భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా రేట్లపై ఎటువంటి చర్యను అయినా చేపట్టేందుకు వీలుగా తటస్థ విధానాన్నే కొనసాగించింది.
→ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఆర్‌బీఐ 1 శాతం రెపో రేటును తగ్గించింది. ఆగస్ట్ సమీక్ష నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది.
→ 2025–26 సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతానికి తగ్గించింది. 4 శాతం నిర్దేశిత లక్ష్యం కంటే ఇది తక్కువే. లోగడ ఇది 3.1 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా. ఆగస్ట్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా ఉంది.
→ సేవల ఎగుమతులు, విదేశాల నుంచి స్వదేశానికి నిధుల బదిలీ (రెమిటెన్స్‌లు) దన్నుతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోనే ఉంటుంది.
→ ఆర్‌బీఐ తదుపరి సమీక్ష సమీక్ష డిసెంబర్ 3–5 వరకు జరుగుతుంది.