
స్వల్ప కాలంలో దేశీ ఉత్పత్తులకు దన్ను
మరోవైపు దిగుమతుల బిల్లు మరింత భారం
న్యూఢిల్లీ: దేశీ కరెన్సీ యూఎస్ డాలరుతో మారకంలో తాజాగా చరిత్రాత్మక కనిష్టం 88.75ను తాకడంతో ఎగుమతులు పుంజుకునేందుకు వీలు చిక్కుతుంది. రూపాయి బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో దేశీ ప్రొడక్టులు చౌకగా మారి పోటీలో బలపడనున్నాయి. దీంతో ఎగుమతిదారులకు లబ్ది చేకూరనుంది. అయితే కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గుల కారణంగా దిగుమతులకు సవాళ్లు ఎదురుకానున్నట్లు ఎగుమతిదారులు పేర్కొంటున్నారు. ముడివ్యయాలు పెరిగిపోవడంతో ప్రధానంగా రత్నాలు, బంగారు ఆభరణాలు, పెట్రోలియం, ఎల్రక్టానిక్స్ తదితర దిగుమతి ఆధారిత రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు తెలియజేశారు.
మంగళవారం(23న) ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 47 పైసలు పతనమై 88.75 వద్ద నిలిచింది. విదేశీ ఫండ్స్ పెట్టుబడులు వెనక్కిమళ్లడానికితోడు.. హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో దేశీ ఐటీ సరీ్వసుల ఎగుమతులకు దెబ్బతగలనున్నట్లు ఫారెక్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రూపాయి పతనం స్వల్పకాలంలో ఎగుమతిదారులకు లబ్దిని చేకూర్చనున్నట్లు భారత ఎగుమతిదారుల సమాఖ్య(ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ పేర్కొన్నారు. అయితే డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ విలువ స్థిరత్వాన్ని సాధించవలసి ఉన్నట్లు తెలియజేశారు.
టారిఫ్‌ల నేపథ్యంలో..
యూఎస్ అధిక టారిఫ్‌లు అమలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి బలహీనత దేశీ ఎగుమతులకు దన్నుగా నిలవనున్నట్లు ముంబై సంస్థ టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ ఎస్‌కే సరఫ్ పేర్కొన్నారు. రానున్న 4–5 నెలల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ 100ను చేరనున్నట్లు అంచనా వేశారు. డాలరుతో రూపాయి మారక విలువ 100కు చేరడం సాధారణ విషయంగా మారిపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా.. రూపాయి పతనం ముడిచమురు, బంగారం, ఎల్రక్టానిక్ వస్తువుల దిగుమతుతోపాటు.. విదేశీ చదువు, పర్యాటకాన్ని భారంగా మార్చనున్నట్లు మరొక ట్రేడర్ వివరించారు.
ఎగుమతిదారులకు లబ్ది చేకూర్చనున్నప్పటికీ, దిగుమతిదారులు అదేపరిమాణంలోని వస్తువులకు అధిక ధరను చెల్లించవలసి వస్తుందని తెలియజేశారు. దేశీ అవసరాలకు వినియోగించే చమురులో 85 శాతంవరకూ దిగుమతులనుంచి సమకూరుతున్న సంగతి తెలిసిందే. దీంతో చమురు, బంగారంతోపాటు.. ఎలక్ట్రానిక్స్, కోల్, ప్లాస్టిక్ మెటీరియల్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మెషీనరీ తదితర దిగుమతులకు అధికంగా చెల్లించవలసి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో ఎగుమతులు 184 బిలియన్ డాలర్లను అధిగమించగా.. దిగుమతులు 306.52 బిలియన్ డాలర్లను తాకాయి. వెరసి ఈ అంతరం వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.