ప్రయివేట్ క్రెడిట్ వృద్ధి చెందడంపట్ల సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రయివేట్ క్రెడిట్ అందిస్తున్న సంస్థలు కొన్ని కారణాలరీత్యా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని వ్యక్తులకు ఫైనాన్స్ సమకూర్చుతుంటాయని తెలియజేశారు.
ఇదేవిధంగా బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హతలేని మరికొంతమందికి సైతం రుణ సౌకర్యాలు కల్పిస్తుంటాయని పేర్కొన్నారు. దీంతో త్వరితగతిన, అధిక రిటర్నులకు వీలున్నట్లు తెలియజేశారు. అయితే ప్రత్యామ్నాయ రంగం(ప్రయివేట్ క్రెడిట్) విస్తరిస్తుండటంపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా నియంత్రణ సంస్థలకు సూచించారు. ఈ రంగం భారీగా విస్తరిస్తే వ్యవస్థాగత రిస్కులు పెరుగుతాయని తెలియజేశారు.
వెరసి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ఒకస్థాయికి మించి ఈ రంగం వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌పై పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో సిన్హా ప్రసంగించారు. స్టార్టప్ వ్యవస్థ వృద్ధికి వీలుగా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కు మరింత మద్దతు ఇవ్వవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా సిన్హా తెలియజేశారు.


