breaking news
U K Sinha
-
ఇటు ఆదా..అటు ఆదాయం
స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టనివారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవటం కొత్తేమీ కాదు. కాకపోతే ఆ ఫండ్స్‌లో కూడా పన్ను మినహాయింపులిచ్చేవి ఉన్నాయి.అంటే ఆ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెడితే అంత మొత్తాన్ని మనం ఆదాయపు పన్ను మినహాయంపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చన్న మాట. ఇప్పటిదాకా ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మినహాయింపు వస్తోంది. దాన్ని రెట్టింపు చేయాలని, రూ.2 లక్షలకు పెంచాలని తాజాగా సెబీ సూచించింది. ఇలా చేస్తే రిటైల్ మదుపరుల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఈ సూచనలు అమల్లోకి వస్తే... చిన్న మదుపరులకు డబుల్ ట్యాక్స్ బొనాంజానే!!. ఈ నేపథ్యంలో అసలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? వీటిల్లో ఉండే లాభనష్టాలేంటీ? ఇవన్నీ వివరించేదే ఈ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందాలనుకునే వారికోసమే పుట్టాయి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలు (ఈఎల్ఎస్ఎస్). వీటినే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌గా కూడా పిలుస్తుంటారు. అటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ దానిపై వచ్చే లాభాలతో పాటు, ఇటు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉండటమే కాక... మిగిలిన పథకాలతో పోలిస్తే వీటి లాకిన్ పీరియడ్ అతి తక్కువ కావడం ప్రధాన ఆకర్షణ. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, బీమా, పోస్టాఫీసు వంటి అనేక పథకాలు ఉన్నప్పటికీ వీటి కాలపరిమితి కనిష్టంగా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటోంది. అదే కొన్ని బీమా పథకాల్లో అయితే 30 నుంచి 40 ఏళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. కాని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో లాకిన్ పీరియడ్ కేవలం మూడేళ్లు. ఇన్వెస్ట్ చేసిన మొదటి మూడేళ్లు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌గా ఉండి, లాకిన్ పీరియడ్ అయిన తర్వాత ఓపెన్ ఎండెడ్ పథకాలుగా మారుతాయి. అంటే మూడేళ్ల తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలగొచ్చు. లేదా మరింత లాభాలను ఆశిస్తే కొనసాగవచ్చు. రాబడిపై హామీ ఉండదు... ఇవి కూడా మ్యూచువల్ ఫండ్సే కావటంతో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అందించే రాబడిపై ఎలాంటి హామీ ఉండదు. సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో అసలు కూడా నష్టపోవాల్సి ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను అందించే సాధనాల్లో ఈక్విటీలే ముందుంటాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గడిచిన మూడేళ్లలో పలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ 8 నుంచి 13 శాతం రాబడిని అందిస్తే, గత ఏడాది కాలంలో 10 నుంచి 18 శాతం వరకు లాభాలను అందించాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వైదొలిగే అవకాశం లేకపోవడంతో ఫండ్ మేనేజర్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించడానికి వీలుండే షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. రెండిందాలా లాభం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు గరిష్ట ట్యాక్స్ శ్లాబ్ (30%)లో ఉన్న వారు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నేరుగా రూ.30,000 పన్ను ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ఇవి లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వస్తాయి కాబట్టి అందించే లాభాలపై కూడా ఎటువంటి పన్ను భారం ఉండదు. అదే బ్యాంకు డిపాజిట్లు అయితే వడ్డీని ఆదాయంగా పరిగణించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సెబీ నిబంధనలు అమల్లోకి వస్తే రెండు లక్షల మేరకు పన్ను ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లు లేదా ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా దగ్గర్లోని మ్యూచువల్ ఫండ్ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. వీటిల్లో ఒకేసారిగా లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి 3 సంవత్సరాలు వేచి చూడాలి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి.- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం పథకం పేరు 3 ఏళ్లలో వృద్ధి% యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 13 బీఎన్పీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 10 హెచ్డీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 8 ఎడల్విస్ ఈఎల్ఎస్ఎస్ 8 రెలిగేర్ ట్యాక్స్ ప్లాన్ 8 పథకం పేరు ఏడాదిలో వృద్ధి యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 18 ఎడల్విస్ ఈఎల్ఎస్ఎస్ 15 బీవోఐ ట్యాక్స్ అడ్వాంటేజ్ 12 ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 10 సహారా ట్యాక్స్ గెయిన్ 10 -
ప్రైమరీ మార్కెట్‌కు ఊతం
ముంబై: ప్రైమరీ మార్కెట్లకు ఊతమిచ్చే దిశగా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐపీవోలకు గ్రేడిం గ్ తప్పనిసరన్న నిబంధనను సడలించాలని యోచి స్తోంది. మరో వారం, పది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు. సెబీ ఆమోదం లభించినా ఇప్పటికీ సుమారు రూ. 72,000 కోట్ల విలువ చేసే ఐపీవో ప్రతిపాదనలు మార్కెట్లోకి రాలేదని అంచనా. ఈ నెల 24న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కార్పొరేట్ బాండ్లకు సంబంధించి షెల్ఫ్-ప్రాస్పెక్టస్ జారీ చేయగలిగే అర్హత నిబంధనలను సడలించడం ద్వారా మరిన్ని కంపెనీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింప చేసే యోచన కూడా ఉన్నట్లు సిన్హా వివరించారు. ఒకే ప్రాస్పెక్టస్‌ని ఉపయోగించి బాండ్ ఇష్యూ పరిమాణాన్ని విడతల వారీగా సమీకరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాగా, లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించడంపైనా దృష్టి పెట్టినట్లు సిన్హా తెలిపారు.