స్వయంసమృద్ధి సాధించాం..
హోం మంత్రి అమిత్ షా వెల్లడి
గ్వాలియర్/రేవా: సెమీ కండక్టర్ రంగంలోకి మన దేశం కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బలోపేతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించి, ఎగుమతులను కూడా మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. గురువా రం గ్వాలియర్‌లో జరిగిన అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమిట్‌లో హోం మంత్రి మాట్లాడారు.
కేవలం ఏడాది కాలంలోనే 4.57 లక్షల ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ)ల రిజిస్ట్రేషన్లను సాధించినందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. భౌగోళికంగా ఎంతో కీలకమైన, సారవంతమైన భూములున్న మధ్యప్రదేశ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారు సైతం కోట్లాది రూపాయలు సంపాదించగలరన్నారు.
ఇండోర్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు అక్కడ వేర్‌హౌస్‌లు, హబ్‌లు ఏర్పాటు చేసుకునేలా ఆహ్వానిస్తామని చెప్పారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి అమిత్ షా రూ.2 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అటల్ జీ గొప్ప వక్త, సున్నిత భావాలున్న కవి, ప్రజాసంక్షేమానికే జీవితం అంకితం చేసిన నేత, రాజకీయాల్లో అజాతశత్రువు’అంటూ కొనియాడారు. సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయం
మనకు వచ్చే ఎన్నో వ్యాధులకు రసాయన ఎరువులే మూల కారణమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే ప్రకృతి వ్యవసాయమే మేలన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులకు ఆదాయం కనీసం ఒకటిన్నర రెట్లు అధిక ఆదాయం వస్తుందని, నీరు ఆదా అవడంతోపాటు పరిశుద్ధమైన ఉత్పత్తులతో ప్రజారోగ్యానికి దోహదపడుతుందన్నారు. ఒకే ఒక్క దేశ వాళీ ఆవు మూత్రం, పేడను వినియోగించుకుంటూ 21 ఎకరాల్లో వ్యవసాయ చేయవచ్చన్నారు.
రేవాలో జరిగిన రైతుల సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అపారమైన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని రైతుల వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి మరింత మెరుగ్గా చేరుకునేలా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని షా చెప్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని, ఇవి రైతులకు అవసరమైన భూసార, విత్తన పరీక్షలను చేస్తాయన్నారు.


