టాప్ టెక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పని చేస్తున్న వ్యక్తి నిత్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మరెన్నో సమావేశాల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. చాలా మంది ఇలాంటి బాధ్యతల్లో ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితానికి చాలా తక్కువ సమయం గడుపుతూ, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. కానీ టెక్ దిగ్గజం సిస్కో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జీతూ పటేల్ జీవితం మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు.
పనిలో విశ్రాంతి లేకపోయినా తన కుమార్తెకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పారు. తన సమావేశంలో ఎప్పుడైనా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. అందరూ కుటుంబ బంధానికి అత్యంత విలువ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం ప్రకారం, పటేల్ రోజువారీ కార్యకలాపాలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు ఉంటాయి. ఈ కఠినమైన పని విధానంలో ఆయన ఒక స్మార్ట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు ముందు సీఈఓ లేదా బోర్డు సమావేశాలు తప్పా మరే ఇతర మీటింగ్‌లకు అనుమతి ఉండదు. ఈ సమయంలో ఆయన పనిలో విభిన్నంగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఆలోచిస్తానని, ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఉపయోగిస్తానని చెప్పారు. తర్వాత క్షణం తీరిక లేకుండా రోజువారీ కార్యకలాపాలుంటాయని చెప్పారు.
ఈ బిజీ షెడ్యూల్‌లో మొదటి నియమం.. తన కూతురికి సంబంధించింది. అత్యంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా సరే ‘నా కుమార్తె ఏ సమావేశానికైనా వచ్చి నన్ను ఏదైనా అడగవచ్చు. తలుపు తట్టాల్సిన అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. ఇది ఒక వ్యక్తిగత అనుభవం నుంచి పుట్టింది. 2023లో తన తల్లి చివరి రోజుల్లో పటేల్ కార్పొరేట్ బాధ్యతల నుంచి ఎనిమిది వారాల పాటు దాదాపు పూర్తిగా దూరంగా ఉండి ఆసుపత్రిలో ఆమెతో గడిపారు. ఈ క్షణాలు ఆయనకు ఒక చేదు సత్యాన్ని నేర్పాయని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ సమతుల్యంగా ఉండదు. చాలాసార్లు కుటుంబం మాత్రమే మొదటి స్థానంలో ఉంటుంది. మీ కోసం పనిచేసే వ్యవస్థను మీరే రూపొందించుకోవాలి, మరెవరూ ఈ పని చేయరు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!


