
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్‌ను ఆమె కోరారు. అక్రమ తవ్వకాల కారణంగా ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు.
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని యమునా నది వెంట అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి చేరడంతో ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో రేఖా గుప్తా.. యమునా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు నది కరకట్టలను బలహీనపరుస్తున్నాయి. దీంతో, దేశ రాజధానిలో వరదల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నది సహజ మార్గాన్ని కూడా మారుస్తాయి. ఇది నది పరిసర ప్రాంతాల్లో నివసించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ తవ్వకం వరద ప్రమాదాన్ని కలిగించడమే కాకుండా దీర్ఘకాలిక పర్యావరణ నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అక్రమ మైనింగ్‌పై అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాన్ని తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఎన్జీటీ గుర్తించింది. అందుకే ఇప్పటికైనా యూపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని కోరుతున్నాను. దీనిపై తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలి’ అని యోగి ప్రభుత్వాన్ని కోరారు.
ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు. దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య ఉమ్మడి చర్యలు అవసరమని అన్నారు. దీని అమలు బాధ్యతలో గందరగోళాన్ని నివారించడానికి నది వెంబడి అధికార పరిధిని ఉమ్మడిగా గుర్తించడంతో సహా ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు తీసుకోవాలని ఆమె ప్రతిపాదించారు. స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్లే పర్యవేక్షణ చర్యలు క్లిష్టతరంగా మారినట్టు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సహకార విధానాన్ని కోరుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యూపీ పరిపాలనా సమన్వయాన్ని ప్రారంభించాలని అభ్యర్థించారు.