
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్‌పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.
ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు.