ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌ | He Bowled with: Gill Hails Magnificent Akash Deep After historic Win Edgbaston | Sakshi
Sakshi News home page

ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌

Jul 7 2025 7:22 AM | Updated on Jul 7 2025 7:46 AM

He Bowled with: Gill Hails Magnificent Akash Deep After historic Win Edgbaston

ఇంగ్లండ్‌ గడ్డ మీద టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఎక్కడైతే వరుస పరాజయాలు చవిచూసిందో అక్కడే ఘన విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికపై తొలిసారి టెస్టు మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టును ఏకంగా 336 పరుగుల  (India Beat England)తో చిత్తు చేసింది.

ఇక భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు ఇదే తొలి విజయం. లీడ్స్‌లో స్టోక్స్‌ బృందం చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూనే.. సరికొత్త చరిత్ర సృష్టించాడు గిల్‌. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా సత్తా చాటి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్‌ డబుల్‌ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆఖరి రోజు వర్షం అడ్డంకిగా మారినా.. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (Akash Deep) తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా పది వికెట్లు కూల్చాడు.

ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే
ఈ నేపథ్యంలో విజయానంతరం కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. ఆకాశ్‌ దీప్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు తన ప్రాణం పెట్టి పూర్తి నిబద్ధతతో ఆడాడు. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో అద్భుతం చేశాడు. ఇలాంటి వికెట్‌ మీద ఇలా బౌలింగ్‌ చేయడం అందరికీ సాధ్యం కాదు. అతడొక అద్భుతం అంతే’’ అంటూ ఆకాశ్‌ను ఆకాశానికెత్తాడు.

కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బంది
అదే విధంగా మిగతా బౌలర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. పేసర్లే 17 వికెట్లు తీసి ఇస్తే.. కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 20 వికెట్లు తీయగల బౌలింగ్‌ దళం మాకు ఉంది. గతంలో ఎన్నోసార్లు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత తిరిగి పుంజుకున్నాం.  

మా గెలుపునకు కారణం అదే
గత మ్యాచ్‌ అనంతరం లోపాలపై దృష్టి పెట్టాం. ఈసారి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైంది’’ అని తమ గెలుపునకు గల కారణాన్ని వెల్లడించాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానన్న గిల్‌.. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్‌గానే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.

కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా.. మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ కలిసి అతడు లేని లోటును పూడ్చారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ ఆరు వికెట్లతో అదరగొట్టగా.. ఆకాశ్‌ దీప్‌ నాలుగు వికెట్లు కూల్చాడు. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌ దీప్‌.. ఆరు వికెట్లు కూల్చి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. మిగతా వారిలో సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ ఒక్కో వికెట్‌ తీయగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement