
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్-2025 కోసం 16 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 22) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ కొనసాగగా.. తాజా మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. వికెట్‌కీపర్ బ్యాటర్ నురుల్ హసన్ మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
నురుల్‌తో పాటు మరో ఆటగాడు కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చాడు. సైఫ్ హసన్ ఏడాదిన్నర తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నాడు. సైఫ్ చివరిగా 2023 ఆసియా క్రీడల్లో ఆడాడు.
నురుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. ఇదే అతనికి మూడేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కేలా చేసింది. 31 ఏళ్ల నురుల్ ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్‌కప్‌లో చివరిసారి ఆడాడు.
ఆసియా కప్ కోసం బంగ్లా సెలెక్టర్లు నలుగురు స్టాండ్ బై ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెహిది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్ ఉన్నారు. వీరిలో మిరాజ్ బంగ్లాదేశ్ చివరిగా ఆడిన టీ20 జట్టులో ఉన్నప్పటికీ.. 16 మంది సభ్యుల మెయిన్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇదే జట్టు ఆసియా కప్‌కు ముందు స్వదేశంలో నెదర్లాండ్స్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా కొనసాగనుంది. నెదర్లాండ్స్‌తో సిరీస్ ఆగస్ట్ 30, సెప్టెంబర్ 1, 3 తేదీల్లో జరుగనుంది.
ఆసియా కప్ విషయానికొస్తే.. ఈ ఖండాంతర టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం సెప్టెంబర్ 11న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ హాంగ్‌కాంగ్‌తో పోటీపడుతుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్.. హాంగ్‌కాంగ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుంది.
ఆసియా కప్, నెదర్లాండ్స్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహిదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్
స్టాండ్ బై (ఆసియా కప్‌కు మాత్రమే): సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్