బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తొమ్మిది ఎడిషన్ల తర్వాత మళ్లీ ఆటగాళ్ల వేలం జరిగింది. 2012లో తొలి సీజన్ వేలం తర్వాత ఇప్పటివరకు డ్రాఫ్ట్ విధానం అమల్లో ఉండింది. అయితే రాబోయే సీజన్ కోసం ఈసారి ఆటగాళ్ల వేలం నిర్వహించారు.
ఈ వేలంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నయీమ్‌ను చిట్టగాంగ్ రాయల్స్ BDT 1 కోటి (USD 88000)కు కొనుగోలు చేసింది. ఈ వేలంలో కోటి టాకాల మార్క్ దాటిన ఏకైక ఆటగాడు నయీమే కావడం విశేషం.
నయీమ్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్ నిలిచారు. వీరిద్దరినీ రంగ్‌పూర్ రైడర్స్ ఫ్రాంచైజీనే సొంతం చేసుకుంది. హ్రిదోయ్ USD 73600కు, లిట్టన్ దాస్ USD 56,000కు అమ్ముడుపోయారు.
బంగ్లాదేశీ వెటరన్ స్టార్లు మహ్ముదుల్లా, ముష్ఫికుర్ రహీమ్ కోసం తొలుత ఏ ఫ్రాంచైజీ బిడ్ చేయకపోయినా, చివరికి మహ్ముదుల్లాను రైడర్స్, ముష్ఫికుర్‌ను రాజ్‌షాహి వారియర్స్ వారి బేస్ ప్రైస్ BDT 35 లక్షలకు దక్కించుకున్నాయి.
ఈ వేలంలో విదేశీ ప్లేయర్లు వందల సంఖ్యలో పాల్గొన్నా 90 శాతానికి పైగా అమ్ముడుపోకపోవడం మరో విశేషం. ఈ కేటగిరిలో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనకకు అత్యధిక ధర దక్కింది. ఇతన్ని ఢాకా క్యాపిటల్స్ USD 55000కు కొనుగోలు చేసింది.
కాగా, ఈ సీజన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ డిసెంబర్ 26 నుంచి జనవరి 23 వరకు జరగనుంది. ఈ సీజన్‌లో పాల్గొనే జట్లు.. ఢాకా క్యాపిటల్స్, రంగ్‌పూర్ రైడర్స్, రాజ్‌షాహి వారియర్స్, నోయాఖాలి ఎక్స్‌ప్రెస్, సిల్హెట్ టైటాన్స్, చిట్టగాంగ్ రాయల్స్.


