టీమిండియాకు శుభవార్త. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి కోలుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మెడ గాయం కారణంగా గిల్ దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. ఈ గాయం కారణగానే అతడు సౌతాఫ్రికాతో రెండో టెస్టు కూడా ఆడలేకపోయాడు.
ఇవాళ (డిసెంబర్ 1) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తుంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపీ పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి, ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం.
వైద్యులు ఆయనకు ప్రత్యేక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గాయం తర్వాత బ్యాటింగ్‌కి దూరంగా ఉన్న గిల్, త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల చేసిన పలు విమాన ప్రయాణాల్లో గిల్‌కు ఎలాంటి అసౌకర్యం లేకపోవడం వైద్య బృందాన్ని ఉత్సాహపరుస్తోంది.
డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో గిల్ ఆడతాడా లేదా అన్నది రిహాబ్ ప్రోగ్రామ్‌లో అతని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో, రోహిత్, రాహుల్ అద్భుతమైన అర్ద శతకాలతో భారత్‌కు భారీ స్కోర్ అందించారు.
ఆతర్వాత భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా అద్భుతంగా ప్రతిఘటించినా అంతిమంగా భారత్‌దే పైచేయి అయ్యింది. రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా డిసెంబర్ 3న జరుగనుంది.


