సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నిన్న (నవంబర్ 30) పలు అద్బుత ప్రదర్శనలు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లలో ఆయుశ్ మాత్రే వరుసగా సెంచరీతో విజృంభించగా.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి వారు మెరుపు సెంచరీలతో విరుచుకుపడ్డారు. యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ టోర్నీలో వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.
అభి'షేక్' సెంచరీ
బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఓవరాల్‌గా 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ ధాటికి పంజాబ్ రికార్డు స్థాయిలో 310 పరుగులు చేయగా.. బెంగాల్ కనీస పోరాటం కూడా చేయలేకపోయింది.
విస్ఫోటనం సృష్టించిన పాకెట్ డైనమైట్
త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (జార్ఖండ్) విస్ఫోటనం సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ త్రిపురపై ఘన విజయం సాధించింది.
మాత్రే వరుస సెంచరీలు
ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే మూడు రోజుల వ్యవధిలో రెండో సెంచరీ చేశాడు. ఆంధ్రతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రే 59 బంతుల్లో అజేయమైన 104 పరుగులు చేసి తన జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.
వైభవ్ వరుస వైఫల్యాలు
ఈ టోర్నీలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పరంపర కొనసాగుతుంది. జమ్మూ అండ్ కశ్మీర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. సంచలన పేసర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ వైభవ్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బిహార్‌పై జమ్మూ అండ్ కశ్మీర్ ఘన విజయం సాధించింది.
ఇవే కాక నిన్న మరిన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదయ్యాయి. సంజూ శాంసన్, రజత్ పాటిదార్, రింకూ సింగ్, కరుణ్ నాయర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి నోటెడ్ స్టార్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.


