అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్‌లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్‌పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్ చేసింది.
బుల్స్‌కు ఆడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.
మిగతా ఆటగాళ్లలో రోవ్‌మన్ పావెల్ 20 బంతుల్లో 24 (నాటౌట్), ఫిల్ సాల్ట్ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. జేమ్స్ విన్స్ డకౌటయ్యాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్టాల్లియన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ కమ్ కెప్టెన్ రహ్మానుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 18) సహా అంతా నిదానంగా ఆడారు.
ఆండీ ఫ్లెచర్ 2 (రిటైర్డ్ హర్ట్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ డకౌట్, డు ప్లూయ్ 16, కట్టింగ్ 11, కరీమ్ జనత్ 15, సామ్ బిల్లింగ్స్ 3 పరుగులు మాత్రమే చేశారు. సిక్సర్ల సునామీ సృష్టించి యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 9 సీజన్ల లీగ్ చరిత్రలో యూఏఈ బుల్స్‌కు ఇదే మొదటి టైటిల్.


