కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం | Team India Win Ranchi Match on south africa | Sakshi
Sakshi News home page

కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం

Dec 1 2025 5:21 AM | Updated on Dec 1 2025 5:24 AM

Team India Win Ranchi Match on south africa

వన్డేల్లో విరాట్‌ 52వ సెంచరీ

టెస్టుల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును వన్డేల్లో అధిగమించిన కోహ్లి

తొలి వన్డేలో భారత్‌ విజయం

17 పరుగులతో దక్షిణాఫ్రికా ఓటమి

రాణించిన రోహిత్, రాహుల్‌

మెరిసిన హర్షిత్‌ రాణా, కుల్దీప్‌ 

బుధవారం రెండో వన్డే   

టెస్టు సిరీస్‌ పరాభవం నుంచి కోలుకున్న టీమిండియా... వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ‘స్టార్స్‌’ రోహిత్‌ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించగా... కోహ్లి వీరోచిత సెంచరీతో సత్తా చాటాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్స్‌లతో అచ్చమైన వన్డే ఇన్నింగ్స్‌తో కట్టిపడేశాడు. బంతితో కుల్దీప్, హర్షిత్‌ రాణించారు. సుదీర్ఘ ఫార్మాట్‌ గెలుపు ఇచి్చన స్ఫూర్తితో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగిన సఫారీ జట్టు కడదాకా పోరాడినా పరాజయం తప్పలేదు.  

రాంచీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు... వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (120 బంతుల్లో 135; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) వన్డే కెరీర్‌లో 52వ సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (60; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. బ్రాట్‌కీ (80 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్‌), యాన్సెన్‌ (39 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కార్బిన్‌ బాష్‌ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4, హర్షిత్‌ రాణా 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రాయ్‌పూర్‌లో రెండో వన్డే జరగనుంది.  

సెంచరీ భాగస్వామ్యం...
ఇప్పటికే టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ... ఆడుతున్న ఒక్క ఫార్మాట్‌లోనే అదరగొడుతున్నారు. చివరగా ఆ్రస్టేలియాతో ఆడిన వన్డేలో దంచికొట్టిన ఈ జంట ... సిడ్నీలో ఎక్కడ ఆపిందో రాంచీలో అక్కడి నుంచే మోత మోగించింది. ఫామ్, ఫిట్‌నెస్‌లో యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మరోసారి చాటింది. నాలుగో ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్‌ (18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అవుట్‌ కాగా.. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది విరాట్‌ తన ఉద్దేశాన్ని చాటాడు. సాధారణంగా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించే కోహ్లి చూడచక్కటి షాట్‌లతో కట్టిపడేయగా... రోహిత్‌ కూడా లయ అందుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో భారత జట్టు 80/1తో నిలిచింది. 

సుబ్రాయెన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రెండు వరుస సిక్స్‌లు బాదితే... కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో కోహ్లి చెలరేగిపోయాడు. రోహిత్‌ తనదైన పుల్‌ షాట్‌లతో రెచ్చిపోగా... విరాట్‌ వన్డేల్లో తన రెండో అత్యధిక సిక్స్‌ (7)లు ఈ మ్యాచ్‌లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి 48, రోహిత్‌ 43 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌ అవుట్‌ కాగా... రుతురాజ్‌ (8), సుందర్‌ (13) విఫలమయ్యారు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాక జూలు విదిలి్చన విరాట్‌... సుబ్రాయెన్‌ వేసిన 39వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4 బాదాడు. మరో భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో కోహ్లి అవుటయ్యాడు. ఆఖర్లో జడేజా (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో... రాహుల్‌ కీలక పరుగులు జోడించాడు. 

యాన్సెన్‌ దూకుడు... 
భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం దక్కలేదు. రికెల్టన్‌ (0), డికాక్‌ (0), మార్క్‌రమ్‌ (7) పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో టోనీ  జార్జి (39; 7 ఫోర్లు), బ్రెవిస్‌ (37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి బ్రిట్‌కీ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరు ఎక్కువసేపు నిలవలేకపోయినా... యాన్సెన్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యాన్సెన్‌... భారీ షాట్‌లతో టీమిండియాను భయపెట్టాడు. దీంతో సఫారీ జట్టు పోటీలోకి రాగా... కుల్దీప్‌ యాదవ్‌ ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరినీ అవుట్‌ చేసి జట్టులో ఆనందం నింపాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి బాష్‌ ఆఖర్లో పోరాడినా... జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

వన్డే ‘సిక్స్‌’లలో రోహిత్‌ రికార్డు
ఈ మ్యాచ్‌లో మూడు సిక్స్‌లు బాదిన ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ... వన్డే క్రికెట్‌లో అత్యధిక (352) సిక్స్‌లు కొట్టిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెపె్టన్‌ షాహిద్‌ అఫ్రిది (351) పేరిట 15 ఏళ్లుగా ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స్‌లు బాదగా... రోహిత్‌ 278 మ్యాచ్‌ల్లోనే అతడిని అధిగమించాడు. గేల్‌ (301 మ్యాచ్‌ల్లో 331 సిక్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు.

కోహ్లి కాళ్లు తాకాలని... 
ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విరాట్‌ వరకు చేరుకున్న అభిమాని... కోహ్లికి పాదాభివందనం చేశాడు. అంతలో అప్రమత్తమైన సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) డికాక్‌ (బి) బర్గర్‌ 18; రోహిత్‌ (ఎల్బీ) (బి) యాన్సెన్‌ 57; కోహ్లి (సి) రికెల్టన్‌ (బి) బర్గర్‌ 135; రుతురాజ్‌ (సి) బ్రెవిస్‌ (బి) బార్ట్‌మన్‌ 8;సుందర్‌ (సి) బాష్‌ (బి) బార్ట్‌మన్‌ 13; రాహుల్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 60; జడేజా (సి) మార్క్‌రమ్‌ (బి) బాష్‌ 32; హర్షిత్‌ (నాటౌట్‌) 3; అర్షదీప్‌ (బి) బాష్‌ 0; కుల్దీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు)349

వికెట్ల పతనం: 1–25, 2–161, 3–183, 4–200, 5–276, 6–341, 7–347, 8–347. 

బౌలింగ్‌: యాన్సెన్‌ 10–0–76–2; బర్గర్‌ 10–0–65–2; బాష్‌ 10–0–66–2; బార్ట్‌మన్‌ 10–0–60–2; సుబ్రాయెన్‌ 10–0–73–0. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) రాహుల్‌ (బి) అర్షదీప్‌  7; రికెల్టన్‌ (బి) హర్షిత్‌ 0; డికాక్‌ (సి) రాహుల్‌ (బి) హర్షిత్‌ 0; బ్రీట్‌కీ (సి) కోహ్లి (బి) కుల్దీప్‌ 72; జోర్జి (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 39; బ్రెవిస్‌ (సి) రుతురాజ్‌ (బి) హర్షిత్‌ 37; యాన్సెన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 70; బాష్‌ (సి) రోహిత్‌ (బి) ప్రసిధ్‌ 67; సుబ్రాయెన్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 17; బర్గర్‌ (సి) రాహుల్‌ (బి) అర్‌‡్షదీప్‌ 17; బార్ట్‌మన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్‌) 332. 

వికెట్ల పతనం: 1–7, 2–7, 3–11, 4–77, 5–130, 6–227, 7–228, 8–270, 9–312, 10–332. 

బౌలింగ్‌: అర్షదీప్‌  10–1–64–2; హర్షిత్‌ రాణా 10–0–65–3; సుందర్‌ 3–0–18–0; ప్రసిధ్‌ 7.2–1–48–1; కుల్దీప్‌ 10–0–68–4; జడేజా 9–0–66–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement