ఒకే రోజు 19 వికెట్లు
ఇంగ్లండ్ 172 ఆలౌట్
7 వికెట్లతో నిప్పులు చెరిగిన స్టార్క్
ఆస్ట్రేలియా 123/9
5 వికెట్లతో కట్డడి చేసిన స్టోక్స్
రసకందాయంలో ‘యాషెస్’ తొలి టెస్టు
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాషెస్ సిరీస్ అనూహ్య రీతిలో ఆరంభమైంది. కిక్కిరిసిన పెర్త్ స్టేడియంలో ఆసీస్ పేసర్లు అదరగొట్టడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశాం అనుకుంటే... ఇంగ్లండ్ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు.
స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా... బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బంతితో విజృంభించాడు. ఐదు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. వెరసి... పర్యాటక ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యం దక్కే అవకాశాలున్నాయి.
పెర్త్: పేసర్లకు అనుకూలించే పెర్త్ పిచ్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ధాటిగా ఆడుతూ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... ఒలీ పోప్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), జేమీ స్మిత్ (22 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.
ఆసీస్ పేసర్లు ఆకట్టుకున్న చోట... ఇంగ్లండ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. సారథి బెన్ స్టోక్స్ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో 2 వికెట్లు తీశారు. చేతిలో ఒక వికెట్ ఉన్న ఆస్ట్రేలియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. నాథన్ లయన్ (3 బ్యాటింగ్), బ్రెండన్ డగెట్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
తొలి ఓవర్‌లోనే వికెట్...
ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నాళ్లుగా ప్రభావం చూపలేకపోతున్న ఇంగ్లండ్ జట్టును స్టార్క్ (7/58) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో గట్టిదెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ జాక్ క్రాలీ (0)ని అవుట్ చేసిన అతడు... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. తొలి ఓవర్‌లో వికెట్ పడగొట్టడం స్టార్క్‌కు ఇది 24వసారి. సీనియర్ బ్యాటర్ జో రూట్ (0) డకౌట్ కాగా... కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) ప్రభావం చూపలేకపోయాడు. బెన్ డకెట్ 21 పరుగులు చేశాడు.
పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై సంయమనంతో బ్యాటింగ్ చేయడానికి బదులు ఇంగ్లండ్ జట్టు... తమకు అలవాటైన ‘బాజ్‌బాల్’ ఆటతీరును అవలంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా... ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అరంగేట్ర పేసర్ బ్రెండన్ డగెట్ 2 వికెట్లు తీశాడు. కామెరూన్ గ్రీన్‌కు ఒక వికెట్ దక్కింది.
6 ఓవర్లు వేసి 5 వికెట్లు...
తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్... బౌలింగ్‌లో పట్టుదల కనబర్చింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఆసీస్ అరంగేట్ర ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (0)ను ఆర్చర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్ (41 బంతుల్లో 9; 1 ఫోర్) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా... ఈ మ్యాచ్‌లో సారథ్యం వహిస్తున్న స్టీవ్ స్మిత్ (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు.
ఉస్మాన్ ఖ్వాజా (2) విఫలం కాగా... ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24) తలా కొన్ని పరుగులు చేశారు. తొలి నాలుగు వికెట్లను ఆర్చర్, కార్స్ పంచుకోగా... ఆ తర్వాత కెప్టెన్ స్టోక్స్ మ్యాజిక్ ప్రారంభమైంది. కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేసిన అతడు... వరుసగా హెడ్, గ్రీన్, స్టార్క్ (12), కేరీ, బోలండ్ (3)లను పెవిలియన్ బాట పట్టించాడు. ఇంగ్లండ్ కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా... 5.23 రన్‌రేట్‌తో పరుగులు సాధించగా... ఆస్ట్రేలియా మాత్రం ఆ పని చేయలేకపోయింది.
19 యాషెస్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు నేలకూలడం 1909 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1909 మాంచెస్టర్ టెస్టు తొలి రోజు ఇరు జట్లు ఆలౌటయ్యాయి.
5 ఆస్ట్రేలియా గడ్డపై 5 వికెట్లు పడగొట్టిన ఐదో ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నిలిచాడు. చివరిసారిగా 1982లో ఇంగ్లండ్ సారథి బాబ్ విల్లీస్ బ్రిస్బేన్ టెస్టులో ఈ ఘనత సాధించాడు.
36 బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టేందుకు వేసిన బంతులు. ఇంగ్లండ్ పేసర్లలో ఇది మూడో వేగవంతమైంది. గతంలో స్టువర్ట్ బ్రాడ్ 19 బంతుల్లో (ఆస్ట్రేలియాపై), 34 బంతుల్లో (న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్ నమోదు చేశాడు.
7/58 ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్ ఆడిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై స్టార్క్ 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి.
100 ‘యాషెస్’ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 11వ ఆస్ట్రేలియా పేసర్‌గా స్టార్క్ నిలిచాడు. 21వ శతాబ్దంలో టెస్టు అరంగేంట్రం చేసిన వారిలో ఈ ఘనత సాధించిన మొదటి పేసర్ అతడే.
0/1 యాషెస్ సిరీస్‌లో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదు కాకుండా ఇరు జట్లు ఓపెనింగ్ బ్యాటర్ వికెట్ కోల్పోవడం ఇదే తొలిసారి.
10 బెన్‌స్టోక్స్‌ను స్టార్క్ అవుట్ చేయడం ఇది పదోసారి. భారత స్పిన్నర్ అశ్విన్ 13 సార్లు స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు.


