సామాజిక మాధ్యమాలతో పిల్లలపై దుష్ప్రభావం
వీటిని వాడకుండా నిషేధం విధిస్తున్న ఆస్ట్రేలియా
సోషల్ మీడియా కట్టడి బాటలో మరిన్ని దేశాలు
అడ్డుకట్ట వేయాలంటున్న ప్రపంచ సర్వే ఫలితాలు
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించారు. వచ్చే డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తోంది. వీరు కొత్తగా సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవడానికి వీల్లేదు. ఇప్పటికే ఉంటే అవి రద్దు అవుతాయి. ఈ బిల్లుకు 2024 నవంబర్ 28న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తద్వారా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ప్రపంచంలో నిషేధాన్ని ప్రకటించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
సామాజిక మాధ్యమాలతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. వీటిలో ఉండే కంటెంట్ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుకు హాని కలిగిస్తోంది. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా నిషేధానికి శ్రీకారం చుట్టినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన ఒక అధ్యయనంలో 10–15 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో 10 మందిలో ఏడుగురు హానికరమైన కంటెంట్, వేధింపులకు గురయ్యారని తేలింది.
నిషేధం బాటలో మరిన్ని..
ఇప్పటికే చాలా దేశాలు పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా సోషల్ మీడియా బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా బాటలో మరిన్ని దేశాలు ఉన్నాయి. పదిహేనేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్టు డెన్మార్క్ ప్రకటించింది. అయితే 13, ఆపై వయసున్న పిల్లలు వీటిని వినియోగించాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.
పిల్లల దైనందిన జీవితం, బాల్యాన్ని రూపొందించడంలో హానికరమైన కంటెంట్, వాణిజ్య ఆసక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న డిజిటల్ ప్రపంచంలో వారిని ఒంటరిగా వదిలివేయకూడదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పదహారేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా వాడకుండా వచ్చే ఏడాది నుంచి అడ్డుకట్ట వేయనున్నట్టు మలేషియా వెల్లడించింది.
హానికారక కంటెంట్ 18 ఏళ్లలోపు పిల్లలకు చేరకుండా బ్రిటిష్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్‌ను యూకే అమలు చేస్తోంది. పదిహేనేళ్లలోపు పిల్లలను సామాజిక మాధ్యమాల నుంచి దూరం చేసేందుకు నార్వే ఓ చట్టాన్ని తీసుకొస్తోంది. న్యూజిలాండ్, ఫ్రాన్స్, పాకిస్తాన్ సైతం ఈ బాటలో ఉంది. ‘15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి’.. అని నెదర్లాండ్స్ ప్రభుత్వం సూచించింది.
కోట్లలో యూజర్లు..
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, స్నాప్‌చాట్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాలను వినియోగించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 566 కోట్లు ఉన్నట్టు అంచనా. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తున్నారు.
బడికి వెళ్లే పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. ఒక్కొక్క దేశాన్నిబట్టి 13–17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 95% వరకు, 8–12 ఏళ్లవారిలో 40% మందికి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
అత్యధికుల మాట అదే..
ఫ్రాన్స్‌కు చెందిన మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇప్సాస్ ఈ ఏడాది జూన్–జూలైలో 30 దేశాల్లో సర్వే చేపట్టింది. 18–75 ఏళ్ల వయసున్న 23,700 మంది ఇందులో పాలుపంచుకున్నారు. ఇప్సాస్ ఎడ్యుకేషన్ మానిటర్–2025 ప్రకారం.. 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటూ 71% మంది తమ గళం వినిపించారు.
గత ఏడాది సర్వేలో 65% మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండోనేషియాలో 87% మంది, ఫ్రాన్స్ 85, ఆస్ట్రేలియాలో 79% మంది బ్యాన్‌వైపు మొగ్గు చూపారు. అయితే భారత్‌లో గత ఏడాది 73% మంది ఈ అంశాన్ని ఏకీభవిస్తే.. 2025లో ఈ సంఖ్య 68%కి వచ్చి చేరింది.


