తిరువనంతపురం: శబరిమల బంగారు అభరణాల కేసులో అరెస్టైన ఆలయ ప్రధాన పూజారి కందావారు రాజీవరు ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది మంది సభ్యులున్నా సిట్ బృందం ఈరోజు( శనివారం) మద్యాహ్నం ప్రాంతంలో పూజారి నివాసానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలు ఏమైనా లభిస్తాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు.. అనారోగ్యం కారణంగా అరెస్టయిన కందరరు రాజీవరు వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరారు.
తిరువనంతపురం స్పెషల్ సబ్-జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తంత్రి ఆరోగ్య సమస్యలను నివేదించిన తర్వాత మొదట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల తరువాత, అతను ప్రత్యేక సంరక్షణ కోసం మెడికల్ కాలేజీకి బదిలీ చేయబడ్డారు. వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తీసుకురాగానే.. మెడిసిన్, కార్డియాలజీ విభాగాల అధిపతులు ఆయనను పరీక్షించారు. నిపుణుల సూచన మేరకు అతడిని ఐసీయూకి తరలించారు. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
అయితే, జైలులో అల్పాహారం తీసుకుంటుండగా తంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జైలు అధికారులను వైద్య సహాయం కోరారు. అనంతరం, అతన్ని పరీక్షించేందుకు ఒక వైద్యుడు జైలుకు వెళ్లాడు. సదరు వైద్యుడి సూచనలు మేరకు రాజీవరును ఆసుపత్రికి తరలించారు.
కాగా శబరిమల బంగారు తాపడాల చోరి కేసులో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కందావారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో నిన్న ఉదయం ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా సిట్ విచారణ చేపడుతుంది. కాగా ఈ కేసులో ఆయన అరెస్టు 11వది.
ఏమిటి ఈ కేసు?
2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్‌మాల్ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.


