లక్నో: అయోధ్య రామమందిరం వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అయోధ్య పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తిని.. ప్రస్తుతం నిఘా వర్గాలు అతన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రాగా.. భద్రతా నిర్వహణపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయోధ్య పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్ సోఫియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్(55) అజ్మీర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయల్దేరాడు. అయితే అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం అయోధ్య రామ మందిర కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాడు. ఆపై సీతమ్మ మండపం దగ్గర నమాజ్ చేసేందుకు ప్రయత్నించాడు. కాంప్లెక్స్ దగ్గర కాపలాగా ఉండే సిబ్బంది అది గమనించి అతన్ని నిలువరించారు. ఆ సమయంలో అతను నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆపై పోలీసులకు అప్పగించగా.. విచారణ జరుపుతున్నారు.
సున్నితమైన అంశం కావడంతో.. అతన్ని నిఘా ఏజెన్సీలకు అప్పగించారు. లోపలికి వెళ్లే టైంలో అతని బ్యాగులో కిస్మిస్, జీడిపప్పు మాత్రమే కనిపించాయని తనిఖీ సిబ్బంది చెబుతున్నారు. అయితే అతను అజ్మీర్ అని చెప్పి అయోధ్యకు ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? తదితర అంశాలపై దృష్టిసారించాయి. రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు.
అయోధ్య రామాలయం దేశంలో అత్యాధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఆలయాల్లో ఒకటి. అలాంటి చోట ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం అయోధ్య రామమందిర ప్రాంగణంలో జరగబోయే మకర సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.


