పురుషుల సింగిల్స్ రన్నరప్ శ్రీకాంత్
లక్నో: సొంతగడ్డపై సత్తా చాటుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో టాప్ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట తమ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 76 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 17–21, 21–13, 21–15తో కహో ఒసావా–మాయ్ తనాబె (జపాన్) ద్వయంపై విజయం సాధించింది. భుజం గాయం కారణంగా ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న గాయత్రి గత వారం ఆ్రస్టేలియన్ ఓపెన్ టోరీ్నతో పునరాగమనం చేసింది. విజేతగా నిలిచిన గాయత్రి–ట్రెసా జోడీకి 18,960 డాలర్ల (రూ. 16 లక్షల 94 వేలు) ప్రైజ్ మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ 59వ ర్యాంకర్ జేసన్ గుణవాన్ (హాంకాంగ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–8, 20–22తో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్‌లో మలేసియా ఓపెన్ సూపర్–500 టోర్నీ ఫైనల్లోనూ శ్రీకాంత్ ఓడిపోయాడు. రన్నరప్ శ్రీకాంత్‌కు 9,120 డాలర్ల (రూ. 8 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


