మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వెటరన్ స్టార్ విరాట్ కోహ్లి అద్భుత శతకంతో (135) చెలరేగి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మరో వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (57), ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ (60) కూడా తలో హాఫ్ సెంచరీ చేసి, గెలుపులో తనవంతు పాత్రలు పోషించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత శిబిరంలో గుబులు పుట్టించారు. అంతిమంగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది.
సఫారీల ఆట కట్టించడంలో భారత బౌలర్లు కూడా తమవంతు పాత్ర పోషించారు. ఆదిలో అర్షదీప్, హర్షిత్ రాణా.. ఆఖర్లో కుల్దీప్ వికెట్లు తీసి సఫారీలను కట్టడి చేయగలిగారు. ఈ గెలుపుతో భారత్ టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మాత్రం ఓ లోపం స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్‌లో భారత్ అవసరం లేని ప్రయోగానికి పోయి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.
సహజంగా ఓపెనింగ్, తప్పదనుకుంటే వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే రుతురాజ్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించి చేతులు కాల్చుకుంది. వాస్తవానికి రుతురాజ్‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు దించే అవసరం లేదు. అప్పటికే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుండింది. రోహిత్ తర్వాత బరిలోకి దిగిన రుతు 14 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా సాధించలేక కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
రుతురాజ్ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. టెక్నికల్‌గా ఆలోచిస్తే, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ కంటే తిలక్ వర్మ బెటర్ ఆప్షన్ అయ్యుండేవాడు. లేని పక్షంలో ఇన్ ఫామ్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా మంచి ఆప్షనే. వీరిద్దరిని కాదని భారత మేనేజ్‌మెంట్ రుతుకు ఎందుకు ఓటు వేసిందో అర్దం కావడం లేదు.
లోతుగా పరిశీలిస్తే.. ఈ మధ్యకాలంలో భారత మిడిలార్డర్ (వన్డేల్లో) అస్వవ్యస్తంగా మారిపోయింది. ఏ మ్యాచ్‌లో ఎవరు, ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారో ఎవరికీ అర్దం కాదు. శ్రేయస్ గాయపడిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది.
వాషింగ్టన్ సుందర్‌కు ప్రమోషన్ ఇచ్చి ఆడిస్తున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించినా, సౌతాఫ్రికా సిరీస్‌లో అతను లేడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను స్థిరంగా ఆడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు.
అయితే సందర్భానుసారం రాహుల్ తన స్థానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు భారీ స్కోర్‌ను అందించాడు.
ఇది తాత్కాలిక ఫలితమే కాబట్టి భారత మేనేజ్‌మెంట్ ఐదు, ఆరు స్థానాల కోసం స్థిరమైన బ్యాటర్లను చూసుకోవాలి. పంత్ సరైన అప్షనే అయినప్పటికీ.. కేఎల్ రాహుల్ వల్ల అది సాధ్యపడకపోచ్చు. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ధృవ్ జురెల్ బెటర్ ఆప్షన్ కావచ్చు.
జురెల్ వికెట్‌కీపింగ్ బ్యాటర్ అయినప్పటికీ, అతన్ని స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొనసాగించినా నష్టం లేదు. పైగా అతను ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు.
లేదనుకుంటే రియాన్ పరాగ్, రింకూ సింగ్ కూడా మంచి ఆప్షన్సే. వీరిద్దరు కూడా ఈ స్థానాలకు న్యాయం చేసే అవకాశం ఉంది. రింకూతో పోలిస్తే పరాగ్‌కు ఆరో స్థానంలో అద్భుతంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలా అని రింకూని కూడా తీసి పారేయాల్సిన అవసరం లేదు. అతను కూడా చేయి తిప్పగల సమర్థుడే.
ఒకవేళ హార్దిక్ పాండ్డా జట్టులోకి వచ్చినా ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే అతడు తరుచూ గాయాలతో సతమతమవుతుంటాడు. కాబట్టి రియాన్, రింకూలకు సరైన అవకాశాలు కల్పిస్తే దీర్ఘకాలం ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది.


