ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్షల పర్వం కొనసాగుతోంది. మరో భూ కుంభకోణం కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష, ఆమె సోదరి షేక్ రెహనాకు ఏడేళ్ల జైలు శిక్ష, రెహనా కూతురు, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢాకాలోని అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం కోర్టు తీర్పు ఇచ్చింది. భూకేటాయింపుల వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో 17 మందిపై కేసు నమోదైంది. మిగిలిన 14 మంది నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. 17 మంది జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో ఒక్కొక్కరు మరో ఆరు నెలలపాటు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. కేసు తీర్పు సందర్భంగా ముగ్గురు నిందితుల్లో ఏ ఒక్కరూ కోర్టు గదిలో లేకపోవడం గమనార్హం. అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అవినీతి కేసుల్లో 78 ఏళ్ల హసీనాకు సంబంధించిన నాలుగో తీర్పు ఇది.
వరుస కేసులు..
ఇదిలా ఉండగా.. వరుస కేసులతో.. కఠిన శిక్షలతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా భారత్‌పైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఆమెపై మరో అభియోగం మోపే దిశగా అడుగులు వేస్తోంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తోంది. హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ ప్యానెల్‌కు రిటైర్డ్ మేజర్ ఏఎల్‌ఎం ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.
2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) తిరుగుబాటు జరిగింది. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది మరణించారు. ఫజ్లుర్ కమిషన్ ఆదివారం సమర్పించిన నివేదికలో ఇలా ఉంది.. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటుకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చారు. ఆనాడు అవామీ లీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగింది. పైగా ఈ తిరుగుబాటులో "విదేశీ శక్తి" ప్రమేయం స్పష్టంగా కనిపించింది. అది భారతదేశమే. ఆ సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డారు. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు అని పేర్కొంది.
హసీనా ప్రభుత్వ హయాంలో బీడీఆర్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది. అయితే ఫజ్లుర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారతదేశం బంగ్లాదేశ్‌లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది.


