
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
టెస్టు సారథిగా అరంగేట్రంలోనే సెంచరీ
ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ శతకం (147) సాధించాడు.
తద్వారా టెస్టు జట్టు సారథిగా తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేసి అనేక రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో మాత్రం గిల్ తన విశ్వరూపం చూపించాడు.
డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగి
తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269)తో దుమ్ములేపిన ప్రిన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (161) సాధించాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడు, కెప్టెన్‌గా గిల్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
ఇక తాజాగా లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సాబ్.. రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులే రాబట్టాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు.
ఆసియా తొలి కెప్టెన్‌గా..
అయితే, మూడో టెస్టులో గిల్ విఫలమైనప్పటికీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన గిల్ ఏకంగా 601 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గా గిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు కోహ్లి పేరిట ఈ రికార్డు ఉండేది.
ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్లు వీరే
🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 601* రన్స్- 2025లో..
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593 రన్స్- 2018లో..
🏏మహ్మద్ అజారుద్దీన్ (ఇండియా)- 426 రన్స్- 1990లో..
🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్)- 364 రన్స్- 1992లో..
🏏సౌరవ్ గంగూలీ (ఇండియా)- 351 రన్స్- 2002లో...
👉ఇక ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో... గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ (597)ను గిల్ అధిగమించాడు. ఇక ఈ లిస్టులో గ్యారీ సోబర్స్ (722), గ్రేమ్ స్మిత్ (714) గిల్ కంటే ముందు వరుసలో ఉన్నారు.
చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా