చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను: బుమ్రా | "Dont Want To Get My Match Fees Deducted...": Jasprit Bumrah Reacts To Ball Change Controversy During 3rd Test Against ENG At Lords | Sakshi
Sakshi News home page

చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా

Jul 12 2025 10:21 AM | Updated on Jul 12 2025 11:40 AM

Dont Want To Get: Bumrah Reacts to Ball Change Controversy Lords Test

బుమ్రా (PC: X)

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టోక్స్‌ బృందానికి తన పేస్‌ పదును రుచిచూపించి.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ ఘనత సాధించి ఆనర్స్‌ బోర్డు (Lord's Hounours Board)పై తన పేరును లిఖించుకున్నాడు.

స్పందించిన బుమ్రా
ఈ నేపథ్యంలో మూడో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా డ్యూక్స్‌ బాల్‌ (Dukes Ball) నాణ్యత, బంతి మార్పుపై చెలరేగుతున్న వివాదంపై ఈ పేస్‌ గుర్రం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘మ్యాచ్‌లో బంతిని మార్చడం సహజమే.

ఆ విషయంలో నేనేమీ చేయలేను. అంతేకాదు.. ఈ వివాదంపై స్పందించి నా డబ్బును పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎందుకంటే.. నేను మ్యాచ్‌లో చాలా ఓవర్లపాటు బౌలింగ్‌ చేసేందుకు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాను.

చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను
కాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో నా మ్యాచ్‌ ఫీజును తగ్గించుకోవాలని అనుకోవడం లేదు. ఏదేమైనా.. మాకు ఇచ్చిన బంతితోనే మేము బౌలింగ్‌ చేస్తాము. బంతి మార్పు అంశంలో ఆటగాళ్లుగా మేము చేయగలిగింది ఏమీ లేదు. అందుకోసం మేము పోరాడలేము కూడా!

ఒక్కోసారి మనకు అనుకూలంగా ఫలితం రావచ్చు. మరోసారి చెత్త బంతినే మన చేతికి ఇవ్వవచ్చు’’ అని బుమ్రా విలేకరుల ప్రశ్నకు బదులిచ్చాడు. 2018లో తాను ఇంగ్లండ్‌లో ఆడినపుడు డ్యూక్స్‌ బాల్‌ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. బంతి అప్పట్లో బాగా స్వింగ్‌ అయ్యేదని.. తాను అప్పుడు అవుట్‌స్వింగర్లనే ఎక్కువగా సంధించేవాడినని బుమ్రా గుర్తు చేసుకున్నాడు.

1-1తో సమంగా సిరీస్‌
కాగా ఆండర్సన్‌-టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి ప్రస్తుతం 1-1తో సిరీస్‌ సమం చేసింది. 

బుమ్రాకు ఐదు వికెట్లు.. ఇంగ్లండ్‌ 387 ఆలౌట్‌
ఇక లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు దక్కించుకోగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌ దక్కింది.

టీమిండియా @145
ఇదిలా ఉంటే... తొలి టెస్టు నుంచి డ్యూక్స్‌ బాల్‌ నాణ్యత విషయంలో టీమిండియా అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎర్ర బంతి త్వరగా రూపు మారడంతో పదే పదే బాల్‌ను మార్చాల్సి వస్తుండగా.. ఇప్పటికే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అంపైర్లతో వాదనకు దిగారు. ఈ క్రమంలో తమకు అనుకూల ఫలితం రాకపోవడంతో బంతిని నేలకేసి కొట్టిన పంత్‌ను ఐసీసీ మందలించింది. అతడి ఖాతాలో ఓ డీ మెరిట్‌ పాయింట్‌  జమచేసింది.

ఇక లార్డ్స్‌ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా గిల్‌, సిరాజ్‌ బంతి మార్పు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బంతిని మార్చినప్పటికీ పాత బంతితో దానికి ఏమాత్రం పోలిక లేదంటూ ఇద్దరూ అసహనానికి గురయ్యారు. ఇదే విషయమై బుమ్రాను ప్రశ్నించగా పైవిధంగా స్పందించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.  

డ్యూక్స్‌ బాల్‌ అంటే..
మొదట్లో డ్యూక్స్‌ కుటుంబం ఎర్ర బంతులను తయారు చేసేది. చేతితో ఆరు వరుసల దారంతో వీటిని కుడతారు. సీమ్‌కు అనుకూలంగా ఉండే ఈ బంతి దీర్ఘకాల మన్నికకు పెట్టిందిపేరు. ఇంగ్లిష్‌ కండిషన్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే, తాజా సిరీస్‌లో త్వరత్వరగా బంతి రూపు మారడం వివాదానికి, బంతి నాణ్యతపై చర్చకు దారి తీసింది. ప్రస్తుతం డ్యూక్స్‌ బాల్‌ తయారీ కంపెనీ దిలీప్‌ జగ్‌జోడియా చేతిలో ఉంది.

చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్‌, సిరాజ్‌ అసహనం!.. గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement