
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య రెండో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి రెండు రోజులు భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించగా.. మూడో రోజు మాత్రం ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్టోక్స్ బృందాన్ని జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు.
ఇద్దరూ సెంచరీలతో చెలరేగి ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో టీమిండియా పట్టుతప్పినట్లే అనిపించింది. అయితే, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ (Akash Deep) తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.
180 పరుగుల మేర ఆధిక్యం
భారత పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ బజ్‌బాల్ ఇన్నింగ్స్ 407 పరుగుల వద్ద ముగిసిపోయింది. 89.3 ఓవర్లలో ఈ మేర స్కోరు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల మేర ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్‌లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0), హ్యారీ బ్రూక్ (158) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్ దీప్.. క్రిస్ వోక్స్(5) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తదుపరి మ్యాచ్‌లో ఆడతానో లేదో తెలియదని.. రెండో టెస్టులో మిగిలిన రెండు రోజుల్లో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు
‘‘ఈ టెస్టు మ్యాచ్‌లో మాకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం. మూడో టెస్టు గురించి నేను ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ రెండు రోజుల్లో నా శాయశక్తులా జట్టు విజయం కోసం పనిచేయడమే ముఖ్యం.
ఆ తర్వాతే మరో మ్యాచ్‌లో ఆడిస్తారా? లేదా? అన్న విషయం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయం. లార్డ్స్ టెస్టు ఆడతారా? అంటే నాకైతే కచ్చితంగా తెలియదు. నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. మ్యాచ్‌కు ఒకరోజు ముందే మాకు ఆ విషయం తెలుస్తుంది’’ అని ఆకాశ్ దీప్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు.
బుమ్రా స్థానంలో
కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. లీడ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలు కాగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.
ఇక లీడ్స్‌లో తొలి టెస్టు ఆడిన భారత ప్రధాన జస్‌ప్రీత్ బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. అయితే, బుమ్రాను తదుపరి లార్డ్స్ టెస్టులో ఆడించేందుకే ఇప్పుడు రెస్ట్ ఇచ్చామని కెప్టెన్ గిల్ చెప్పాడు. దీనిని బట్టి ఆకాశ్ దీప్‌నకు మూడో టెస్టులో చోటు దక్కదా? అన్న ప్రశ్నకు ఈ పేసర్ ఇలా బదులిచ్చాడు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు పూర్తయ్యేసరికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28) పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌పై భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.
చదవండి: 'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్‌పై ఇంజనీర్ ఫైర్