'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్‌పై ఇంజ‌నీర్ ఫైర్‌ | Stupid not to play Kuldeep Yadav: farokh engineer tears into Gambhirs management | Sakshi
Sakshi News home page

'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్‌పై ఇంజ‌నీర్ ఫైర్‌

Jul 5 2025 1:05 PM | Updated on Jul 5 2025 2:49 PM

Stupid not to play Kuldeep Yadav: farokh engineer tears into Gambhirs management

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిప‌త్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 587 ప‌రుగుల భారీ స్కోర్ చేసిన భార‌త్‌.. బౌలింగ్‌లో కూడా ప‌ర్వాలేద‌న్పించింది. ఇంగ్లండ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 407 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు 180 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

ఓవ‌రాల్‌గా గిల్ సేన ప్ర‌స్తుతం 244 ప‌రుగుల లీడ్‌లో కొన‌సాగుతోంది. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో భార‌త్ పట్టుబిగించిన‌ప్ప‌టికి, ఈ మ్యాచ్‌లో స్పిన్న‌ర్‌ కుల్దీప్ యాదవ్‌ను ఆడించ‌కపోవ‌డం తీవ్ర‌విమ‌ర్శ‌లకు దారితీసింది. చాలా మంది మాజీలు ఇండియ‌న్ టీమ్ మెనెజ్‌మెంట్ తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో భార‌త మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజనీర్ చేరాడు. కుల్దీప్‌ను ఆడించ‌క‌పోవ‌డం తెలివ‌త‌క్కువ నిర్ణ‌య‌మ‌ని అత‌డు మండిప‌డ్డాడు.

గ‌త మూడేళ్ల నుంచి భార‌త జ‌ట్టులో అత్యంత‌విజ‌య‌వంత‌మైన స్పిన్న‌ర్‌గా కుల్దీప్ కొన‌సాగుతున్నాడు. అయితే ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో కుల్దీప్‌కు చోటు ద‌క్కుతుంద‌ని అంతా భావించారు. కానీ ఆఖ‌రి నిమిషంలో గంభీర్ అండ్ కో కుల్దీప్‌కు బ‌దులుగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. సుంద‌ర్ బ్యాటింగ్ ప‌రంగా ప‌ర్వాలేద‌న్పించినా బౌలింగ్‌లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు.

ఈ క్ర‌మంలో ఫ‌రూఖ్ ఇంజ‌నీర్ మాట్లాడుతూ.. "కుల్దీప్ యాద‌వ్ మొద‌టి టెస్టు నుంచి ఆడాల్సింది. అత‌డొక మ్యాచ్ విన్న‌ర్‌. ఫ్లాట్ వికెట్‌పై కూడా బంతిని తిప్పే స‌త్తా అత‌డికి ఉంది. కానీ అత‌డి ప‌ట్ల భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అతన్ని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం. 

క‌నీసం రెండు టెస్టులోనైనా అత‌డి ఆడి ఉంటే క‌చ్చితంగా ప్ర‌భావం చూపేవాడు. మూడో టెస్టుకైనా అత‌డిని  ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆటగాళ్ల ఎంపిక ప‌ట్ల భార‌త్ అనుస‌రిస్తున్న విధానం స‌రైన‌ది కాదు. అంతేకాకుండా బుమ్రా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు టెస్టులు మాత్రమే ఆడాలని ముందే నిర్ణయించుకోవడం సరైన‌ది కాదు. ఎందుకంటే ప్ర‌తీ మ్యాచ్‌కు ముందు దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి ల‌భిస్తోంది. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే టెస్టు సిరీస్‌ను మీరు గెలవలేరు" అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement