
PC: X
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తీరును ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుసేన్ విమర్శించాడు. ఓవైపు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. బంతిని మార్చాలంటూ అంపైర్‌ను ఒత్తిడి చేయడం సరికాదన్నాడు. అనవసరంగా బంతిని మార్చుకుని పెద్ద మూల్యమే చెల్లించారంటూ చురకలు అంటించాడు. అసలు విషయమేమిటంటే..
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ లార్డ్స్ (Lord's Test) వేదికగా మూడో మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా వరుస షాకులిచ్చాడు.
వరుస షాకులిచ్చిన బుమ్రా
బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లను పెవిలియన్‌కు పంపిన ఈ రైటార్మ్ పేసర్.. ఈ మేరకు కీలక వికెట్లు కూల్చి టీమిండియాలో జోష్ నింపాడు. అయితే, అదే సమయంలో అంటే రెండో రోజు 10.4 ఓవర్ల ఆట తర్వాత బంతిని మార్చాలని భారత్ కోరగా.. అంపైర్ హూప్ టెస్టు నిర్వహించాడు. బంతి ఆకారం మారిందని గుర్తించి మరో కొత్త బంతినిచ్చాడు.
అయితే, అంపైర్ ఇచ్చిన బంతితో కెప్టెన్ గిల్, మరో పేసర్ మహ్మద్ సిరాజ్ సంతృప్తి చెందలేదు. మునుపటి బంతి కంటే ఇది మరింత పాతదిలా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గిల్ అంపైర్‌తో కాసేపు వాదించాడు కూడా!..
అదొక చెత్త నిర్ణయం
ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసిర్ హుసేన్ స్పందిస్తూ.. గిల్ తీరును తప్పుబట్టాడు. ‘‘బంతిని మార్చుకోవాలనే టీమిండియా నిర్ణయం వింతగా అనిపించింది. ఒకవేళ బంతి ఆకారం మారిందనుకుంటే అంపైరే స్వయంగా బంతిని మారుస్తాడు. లేదంటే.. ఉన్న బాల్‌తో తమకు ఎలాంటి ఉపయోగం లేదని కెప్టెన్ భావిస్తే బంతిని మార్చమని కోరతాడు.
ఈ రెండు సందర్భాల్లోనే బంతిని మారుస్తారు. కానీ.. తొలి సెషన్‌లో బంతి బాగానే ఉంది. 63 డెలివరీలో మాత్రమే సంధించారు. అప్పటికి బుమ్రా ఆ బంతితోనే అద్భుతమైన స్పెల్ వేశాడు. కానీ మరో ఎండ్‌లో సిరాజ్ మాత్రం క్యాచ్‌లు డ్రాప్ చేశాడు.
బంతి వికెట్ కీపర్ చేతికి కూడా బాగానే వచ్చింది. అంతా సజావుగా సాగుతోన్న సమయంలో బంతిని మార్చాలని కెప్టెన్ కోరాడు. అంతటితో అతడు ఆగలేదు.. అంపైర్‌తో గొడవ కూడా పడ్డట్లు కనిపించింది. అయితే, మార్చుకున్న బంతి మరింత పాతదానిలా ఉంది. దీంతో వాళ్లు మరోసారి అసహనానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ నిర్ణయాలు నాకైతే కాస్త చెత్తగానే అనిపించాయి.
బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. ఎందుకిలా చేశావు?
ఒకటి బంతిని మార్చమని అడిగి టీమిండియా తప్పటడుగు వేసింది. అందుకోసం అంపైర్‌తో వాదనకు దిగడం రెండో తప్పు. కొత్త బంతి పాత బంతి కంటే మరింత ఎక్కువగా వాడిన బంతిలా ఉండటంతో.. మంచి బంతిని చేజార్చుకున్నట్లయింది.
ఇది మీ మూడో తప్పు. ఓవైపు బుమ్రా ఆ బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. అనవసరంగా మార్చి ప్రత్యర్థికి మంచి అవకాశం ఇచ్చారు’’ అని నాసిర్ హుసేన్ గిల్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు.
కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌట్ కాగా.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ గిల్ (16) నిరాశపరచగా.. రిషభ్ పంత్ 19 పరుగులు, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయ అర్ధ శతకం (53)తో క్రీజులో ఉన్నారు.
చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా