
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ అమ్మవారి హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మందిరం ట్రస్టు అధ్యక్షులు రాయిసింగి బిడిక, సభ్యులు, మందిరం సూపరింటెండెంట్ సమక్షంలో మందిరం ప్రాంగణంలోని తొమ్మిది హుండీలను తెరిచారు. సాయంత్రం వరకు కొనసాగిన లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు వేసిన కానుకల రూపంలో 1,04,36,963 రూపాయల నగదు, వెండి రెండు కిలోల 505 గ్రాములు, బంగారం 38 గ్రాములు లభించినట్లు మందిరం ట్రస్టు అధ్యక్షులు రాయిసింగ్ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కింపు కొనసాగిందని.. స్థానిక సేవా సంస్థలకు చెందిన మహిళలు, విద్యార్థులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 27వ తేదీన హుండీ లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు వేసిన కానుకల రూపంలో 94,49,054 రూపాయల నగదు, 93 గ్రామలు బంగారం, 2.170 కిలోల వెండి లభించినట్లు వివరించారు. అమ్మవారి హుండీ ఆదాయంలో భాగంగా ఇప్పటికి రెండుసార్లు కోటి రూపాయలు నగదుగా ఆదాయం సమకూరడం విశేషమని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, ఇటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆది, మంగళ, బు«ధవారాల్లో అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారని అన్నారు. సోమవారం నాడు హుండీలొ లభించిన నగదును స్థానిక ఉత్కళ గ్రామీణ బ్యాంకులో అమ్మవారి పేరిట డిపాజిట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా ఈసారి హుండీలొ విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించడం గమనార్హం.