
ఎన్నికల వేళ.. బీహార్‌లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ.
గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కీలక నిందితుడైన వికాస్ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
గోపాల్ ఖేమ్కా.. బీహార్‌లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్‌ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.
గోపాల్ ఖేమ్కా కేసులో.. అశోక్ కుమార్ సాఫ్ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్‌కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్‌యాదవ్ అనే షూటర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోపాల్ అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
పాట్నాలోని బీర్ సెంట్రల్ జైలు నుంచే గోపాల్ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.
గోపాల్ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్‌కుమార్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని లోక్‌సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.