
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారాయన. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తదనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది’’ అని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్న ఆయన.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. వారు(ఒప్పందాలకు దిగిరాని వారు) ఎంత టారిఫ్ చెల్లించాలో లేఖలో చెబుతున్నాం అని ట్రంప్ చెప్పారు.
భారత్‌కు కలిగే లాభాలు:
- మార్కెట్ ప్రాప్యత: అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు పెరగొచ్చు.
- తక్కువ దిగుమతి సుంకాలు: భారత్‌కు వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గవచ్చు.
- టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్: మౌలిక సదుపాయాలు, హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగుకావొచ్చు.
- భద్రతా సహకారం: వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది.
మరోవైపు.. భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే, తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు.
ఏ దేశాలపై.. ట్రంప్ ఎంతెంత టారిఫ్ (ఆగస్టు 1 నుంచి అమలు):
దేశం టారిఫ్ శాతం జపాన్, దక్షిణ కొరియా, కజకస్తాన్, మలేషియా, ట్యునీషియా 25% మయన్మార్, లావోస్ 40% దక్షిణాఫ్రికా, బోస్నియా 30% ఇండోనేషియా 32% బంగ్లాదేశ్, సెర్బియా 35% కంబోడియా, థాయిలాండ్ 36%