ఇటీవల ఓ పెంగ్విన్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అందుక్కారణం ఆ వీడియోలో కనిపించే పెంగ్విన్ ఆహారం కోసం సముద్రం వైపు వెళ్లకుండా.. తన మందను వీడి.. పర్వతాల వైపు సుదీర్ఘ ప్రయాణం చేసింది. అందుకు కారణాలేమిటి? ఆ పెంగ్విన్ ఎందుకు అలా ప్రవర్తించింది? ఇది నిజంగానే పెంగ్విన్ల ‘డెట్ వాక్’కు సంకేతమా? ఇప్పుడు నెటిజన్లు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఏఐ టూల్స్, సెర్చింజన్లను జల్లెడపడుతున్నారు. అయితే.. ‘సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్’ పలు కారణాలను గుర్తించింది. ఆ వివరాలు తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
ఆ వీడియో ఎప్పటిదంటే..
వైరల్ అవుతున్న ఆ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు. 2007 నాటిది. అయితే.. చాలా మంది నెటిజన్లు ఆ పెంగ్విన్ ‘డెత్ వాక్’కు సిద్ధపడే అలా మందను వీడిందనే కన్‌క్లూజన్‌కు వస్తున్నారు. అందుకు సంబంధించిన థియరీలు చెబుతున్నారు. అయితే.. ఆ డాక్యుమెంట్‌ను ‘ఎన్‌కౌంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ అనే పేరుతో చిత్రీకరించారు. దీనికి ప్రఖ్యాత జర్మన్ చిత్ర నిర్మాత వెర్నర్ హెర్జోగ్ దర్శకత్వం వహించారు. అంటార్కిటికాలోని క్లష్ట పరిస్థితులపై ఈ డాక్యుమెంట్‌ను చిత్రీకరించారు. 81వ అకాడమీ అవార్డుల్లో ఈ డాక్యుమెంట్ ఉత్తమ ఫీచర్‌గా నామినేట్ అయ్యింది.
పర్వతాల వైపే ఎందుకెళ్లింది?
అంటార్కిటికాలోని ‘కేప్ రాయిడ్స్’ అనే ప్రాంతంలోని మందకు సంబంధించిన పెంగ్విన్ వింతగా ప్రవర్తిస్తూ.. ఒంటరిగా క్రియాశీల అగ్నిపర్వతం వైపు వెళ్లడంపై ఈ డాక్యుమెంట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆహారం కోసం పెంగ్విన్లు సముద్రం వైపు వెళ్తాయి. కానీ, ఒంటరి పెంగ్విన్ మాత్రం పర్వతాల వైపు వెళ్లింది. అక్కడ ఆహారం దొరకదు. కాబట్టి.. అది ‘డెత్ వాక్’ లేదా ‘డెత్ మార్చ్’ చేసింది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆధారాలు లేకున్నా..
చిత్ర బృందం ఆ పెంగ్విన్‌ను ఫాలో చేయగా.. 80 కిలోమీటర్ల దూరంలో వేరే కాలనీ నుంచి ఇలాగే ఒంటరిగా వచ్చిన పెంగ్విన్‌ను గుర్తించింది. 19 సంవత్సరాల తర్వాత ఒంటరి పెంగ్విన్ వీడియో బయటకు వచ్చి, వైరల్ అయినా.. అసలు విషయం మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత వెర్నర్ రెండో వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఇది డెత్ వాక్ అనేది కేవలం వెర్నర్ హైపోథెసిస్ మాత్రమే..! అది నిజమనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. సైంటిఫిక్‌గా వేర్వేరు కారణాలుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
‘నిహిలిస్ట్ పెంగ్విన్’ అంటే..
మందను వీడి.. ఒంటరిగా దూరంగా వెళ్లే పెంగ్విన్లను ‘నిహిలిస్ట్ పెంగ్విన్’ అని పిలుస్తారు. నిహిలిస్ట్ అంతే.. జీవితం అర్థరహితమని.. పనికిరానిదనే భావన ఉంటుంది. అంటే.. జీవితం వృథా అనే భావనతో మరణమే శరణ్యం అనే అర్థం వస్తుంది. కానీ, పెంగ్విన్లకు ఆత్మహత్య చేసుకునే ధోరణి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఈ వీడియోను చూసిన మానవుల భావోద్వేగాల నుంచి పుట్టిన ‘డెత్ వాక్’ అనే మాటను పెంగ్విన్లపై రుద్దుతున్నారంటున్నారు. పెంగ్విన్లలో ఉండే సహజసిద్ధమైన నావిగేషన్‌లో లోపాలతో అవి మందకు దూరంగా వెళ్తాయని వివరిస్తున్నారు.
అందుకే మందను వీడతాయా?
అంటార్కటిక్‌లో సూర్యకాంతి ఒకేలా ఉండదు. దాంతో.. పెంగ్విన్లు తమ జీవ గడియారాన్ని నమ్ముకుంటాయి. దాన్ని బట్టి గమనాన్ని కొనసాగిస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. సూర్యుడు ఉన్నప్పుడు అవి సముద్రం వైపు వెళ్లడం, మేఘాలు కమ్ముకున్నప్పుట్లు దారీతెన్ను లేకుండా వెళ్లడం జరుగుతుంది. అప్పటికి కూడా పెంగ్విన్లు జీవగడియారానికి భూ అయస్కాంత క్షేత్రం ఆధారంగా గమనాన్ని నిర్దేశించుకుంటాయి. పెంగ్విన్లలో ఈ జీవ గడియారానికి సంబంధించిన నావిగేషన్ సిగ్నల్స్ మందగిస్తే.. అవి మందను వీడుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఒకవేళ తమ మందను తిరిగి కలిస్తే.. అవి సాధారణంగా వ్యవహరిస్తాయని వివరిస్తున్నాయి.
‘డీరేంజ్డ్ పెంగ్విన్’ అంటే..
పెంగ్విన్లు మందను వీడడానికి అనారోగ్యం లేదా శారీరక బలహీనత మరో కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గాయాలు తగిలినప్పుడు.. వాటి ఇన్ఫెక్షన్ మెదడును ప్రభావితం చేస్తే.. మతిభ్రమించినట్లుగా పెంగ్విన్లు ఒంటరితనాన్ని కోరుకుంటాయి. అధిక జ్వరం కారణంగా కూడా పెంగ్విన్ల నాడీ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి పెంగ్విన్లను ‘డీరేంజ్డ్ పెంగ్విన్’ అంటారు. మెదడుపై ఇన్ఫెక్షన్ ప్రభావం కారణంగా ఈ పెంగ్విన్లు సముద్రంలోకి వెళ్లాలనే సాధారణ విషయాన్ని కూడా మరిచిపోతాయి.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
మానవుల్లాగే పెంగ్విన్లకు కూడా మానసిక ఒత్తిడి ఉంటుందని పలు అభిప్రాయాలున్నాయి. ఒత్తిడి కారణంగా అవి తమ మనుగడకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. అంటే.. మందను విడిచి దూరంగా వెళ్లడం. పెంగ్విన్లలో మానసిక ఒత్తిడికి సంబంధించి ఇప్పటి వరకు శాస్త్రీయమైన అధ్యయనాలు జరగలేదు. అయితే.. తనను తాను చంపుకోవాలని పెంగ్విన్లు ఎన్నడూ ఆలోచించవని పలు అధ్యయనాలు వివరించాయి. అందుకే.. ‘డెత్ వాక్’ లేదా ‘డెత్ మార్చ్’ అనే హైపోథెసిస్ తప్పనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒంటరి పెంగ్విన్ వైరల్ వీడియో సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశంపై మీమ్స్ బాగా పెరిగాయి. ఆ మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘‘మనుషులు కూడా బోర్ కొడితే ఇంతే..’’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో రాసుకురాగా.. నిహిలిస్ట్ అనే సిద్ధాంతంపై పుంకానుపుంకాలుగా నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఇక ట్రంప్‌నకు వ్యతిరేకంగా కూడా మీమ్స్ వస్తున్నాయి.
ఆ పెంగ్విన్‌ను ట్రంప్‌గా పోలుస్తూ..
ఆ పెంగ్విన్‌ను ట్రంప్‌గా పోలుస్తూ.. అమెరికా జెండాతో వెళ్తున్నట్లుగా.. గ్రీన్లాండ్‌లో ఆ జెండాను పాతుతున్నట్లుగా వచ్చిన మీమ్‌కు మిలియన్ల వ్యూవ్స్ రావడం గమనార్హం..! ఇక ఢిల్లీ పోలీసులు వినూత్నంగా 70 మీటర్లు వెళ్లినా.. 70 కిలోమీటర్లు వెళ్లినా.. హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆ పెంగ్విన్ చిత్రంతో ప్రచారం చేస్తున్నారు. మేజర్ కీ క్యాపిటల్ అనే నెటిజన్ ఏకంగా నిహిలిజం అనేది కేవలం మీమ్ కాదని.. ఇది జెన్-జీ మానసిక స్థితి అని పేర్కొన్నారు. తోష్ఎక్స్ అనే వినియోగదారుడు ఆ ఒక్క పెంగ్విన్‌ను క్రిప్టో వినియోగదారుడిగా పేర్కొనడం కూడా మిలియన్లలో వ్యూవ్స్ తెచ్చిపెట్టింది.
మానవ భాషలను పోలి..
ఏది ఏమైనా.. ఇది చదివిన తర్వాత.. ఆ ఒంటరి పెంగ్విన్ మందకు ఎందుకు దూరమైందనే ప్రశ్నకు మీకు ఓ సమాధానం దొరికే ఉంటుంది. అయితే.. పెంగ్విన్లు ఎగరలేని పక్షులు. గుంపులుగా జీవిస్తాయి. సముద్రంలో చేపల కదలికలను నిశితంగా గమనించి, వేటాడుతాయి. సమష్టిగా వేటకు ఉపక్రమిస్తాయి. బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్స్ నిర్వహించిన అధ్యయనంలో పెంగ్విన్ల వేటపై స్పష్టమైన వివరాలున్నాయి. పెంగ్విన్ల శబ్దాలు కొంత వరకు మానవ భాషలను పోలి ఉంటాయిని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ టురిన్ జరిపిన అధ్యయనంలో తేలింది.
పెంగ్విన్లు అలా కాదు.. ఎందుకంటే..
మనుషులు ఎక్కువగా ఉపయోగించే ‘హా..’, ‘ఊ..’ వంటి పదాలను పెంగ్విన్లు వాడుతాయి. 2020లో పెంగ్విన్ల స్వరాలపై నిర్వహించిన అధ్యయనంలో అవి తమ శక్తిని రెట్టింపు చేయడానికి ఇలాంటి శబ్దాలను ఉచ్ఛరిస్తాయని తేలింది. మిగతా జంతువులు, పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూస్తే.. వింతగా ప్రవర్తిస్తాయి. తమలాంటి జీవి అక్కడ ఉన్నట్లు భావిస్తాయి. కానీ, పెంగ్విన్లు అలా కాదు. అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూస్తే.. అందంగా ముస్తాబవుతున్నట్లు ప్రతిస్పందిస్తాయి. పెంగ్విన్లపై అధ్యయనం చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎథాలజిస్ట్ అనింద్య సిన్హా కూడా ఇతర పక్షులకు లేని విధంగా పెంగ్విన్లకు మానవుల మాదిరిగా తమపై తమకు అవగాహన ఉంటుందని వివరించారు.


