ప్రపంచాన్ని కదిలిస్తున్న వీడియో
అది అంతులేని మంచు ఎడారి. ఎటు చూసినా గడ్డకట్టే చలి.. ప్రాణవాయువు కూడా భారమయ్యే శూన్యం. అక్కడ వందలాది పెంగ్విన్లు గుంపులు గుంపులుగా ఆహారం కోసం సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. కానీ, ఒక్క పెంగ్విన్ మాత్రం వెనక్కి తిరిగింది. అందరూ వెళ్తున్న బాటను వదిలేసింది. చావు ఎదురొస్తుందని తెలిసినా.. మంచు కొండల వైపు ఒంటరిగా అడుగులు వేస్తోంది.
ఏమిటీ ’నిహిలిస్ట్ పెంగ్విన్’ మిస్టరీ?
ఇటీవల టిక్‌టాక్, ఇన్‌స్టా్రగామ్‌లో ఈ వీడియో ప్రత్యక్షమవ్వగానే.. నెటిజన్లు దీనికి ‘నిహిలిస్ట్ పెంగ్విన్’అని పేరు పెట్టారు. ‘నిహిలిజం’అంటే ‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు, ఏ విలువలకు ప్రాధాన్యం లేదు’అనే ఒక తాతి్వక చింతన. ‘నేను ఎక్కడికి వెళ్లినా చివరికి మిగిలేది శూన్యమే కదా’.. అనే భావనలో ఉన్నవారు, ఆ పెంగ్విన్ ప్రయాణంలో తమను దర్శించుకుంటున్నారు. ‘నేను కూడా ఈ పెంగ్విన్ లాగే ఉన్నాను.. అందరిలా పరుగెత్తలేక ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాను’.. అంటూ లక్షలాది మంది నెటిజన్లు తమ భావోద్వేగాలను దీనికి ముడిపెడుతున్నారు.
అది ‘మృత్యుయాత్ర’
ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ 2007 అంటార్కిటికాలో తన డాక్యుమెంటరీ కోసం చిత్రీకరించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది. సముద్రం వైపు వెళ్తేనే దానికి ఆహారం దొరుకుతుంది, ప్రాణం నిలుస్తుంది. కానీ, ఆ పెంగ్విన్ తన గమ్యాన్ని మార్చుకుంది. ఎవరూ లేని, ఏమీ దొరకని నిర్జన పర్వతాల వైపు అది సాగిస్తున్న ప్రయాణాన్ని దర్శకుడు ‘మృత్యు యాత్ర’అని పిలిచాడు. ఎందుకంటే, ఆ దారిలో దానికి ఎదురయ్యేది కేవలం మరణం మాత్రమే.
గుండె బరువెక్కుతోంది
జనవరి 16న ఒక టిక్‌టాక్ యూజర్ ఈ వీడియోను ఎడిట్ చేసి ‘లామోర్ టూజూర్’అనే పాటను జత చేయడంతో అది విశ్వవ్యాప్తంగా కదిలిస్తోంది. ఇది ఒక ఫ్రెంచ్ పేరు. తెలుగులో దీని అర్థం ‘శాశ్వతమైన ప్రేమ’లేదా ‘ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమ’. ఆ గంభీరమైన సంగీతం, పెంగ్విన్ వేస్తున్న ఆ నిశ్శబ్ద అడుగులు చూస్తుంటే గుండె బరువెక్కక మానదు. చివరికి ఆ పెంగ్విన్ ఏమౌతుందో అందరికీ తెలుసు. అది తిరిగి రాదు. కానీ, ఆ ప్రయాణం మనిషికి ఒక నిశ్శబ్ద సత్యాన్ని బోధిస్తోంది. బతుకు పోరాటంలో అలిసిపోయిన ఆత్మలకు ఆ పెంగ్విన్ ఒక మూగ సాక్ష్యం. ఇది కేవలం ఒక పక్షి నడక కాదు.. ప్రతి మనిషి లోపల దాగి ఉన్న ఒక నిశ్శబ్ద ఆవేదన.
– సాక్షి, నేషనల్ డెస్క్


