ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది.
వీడియో వైరల్
ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్.
ఏదో ఒక రోజు కలుస్తా..
చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.
ఎంతో ప్రత్యేకం
'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్‌గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్ డియర్ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు.


